iDreamPost

చిరంజీవి ఇంటి ముందు దీక్ష చేస్తే బాల‌య్య ఇంటి ముందు ఏం చేయాలి

చిరంజీవి ఇంటి ముందు దీక్ష చేస్తే బాల‌య్య ఇంటి ముందు ఏం చేయాలి

రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ పేరుతో ప్రారంభ‌మ‌యిన ఉద్య‌మం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల వేట‌లో సాగుతోంది. కింద‌ప‌డ్డా మాదే పైచేయి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే టీడీపీ నేత‌ల ఆలోచ‌న‌కు త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు ధర్నా చేస్తామంటూ అమ‌రావ‌తి జేఏసీ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. దానిని సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ చేశారు. హైద‌రాబాద్ లో చిరంజీవి ఇంటి ముందు ఈనెల 29న ఆందోళ‌న‌కు త‌ర‌లిరావాల‌ని జేఏసీ త‌రుపున పిలుపునివ్వ‌డం విశేషంగా మారింది.

చిరంజీవి గ‌త రెండేళ్లుగా రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం అయ్యారు. సినిమాల్లో బిజీగా గ‌డుపుతున్నారు. కానీ వివిధ సంద‌ర్భాల్లో త‌న అభిప్రాయాల‌ను చెప్ప‌డానికి వెనుకాడ‌డం లేదు. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న రాగానే అంద‌రిక‌న్నా ముందే త‌న అభిప్రాయం చెప్పేశారు. ఏపీ అబివృద్ధికి అది దోహ‌దం చేస్తుంద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ప‌లుమార్లు మాట మార్చినా చిరంజీవి స్టాండ్ మార‌లేదు. అలాంటి చిరంజీవిని ఇప్పుడు అమ‌రావ‌తికి మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని , అందుకు ధ‌ర్నా చేస్తామ‌ని అన‌డంలో అమ‌రావ‌తి జేఏసీ ఏం ఆశిస్తుంద‌న్న‌ది అర్థంకాని అంశంగా మారింది.

చిరంజీవిని సినిమా హీరోగా త‌మ ఉద్య‌మానికి మ‌ద్ధ‌తివ్వ‌మ‌ని అడ‌గ‌ద‌ల‌చుకున్నారా..అంటే చిరు క‌న్నా ముందు బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌హా చాలామంది హీరోలున్నారు. అయినా చిరంజీవి ఇంటి ముందే ధ‌ర్నా అన‌డంలో ఔచిత్యం ఏమిటో జేఏసీ నేత‌లకు కూడా తెలిసి ఉంటుంద‌ని చెప్ప‌లేం. మొన్న‌టి సంక్రాంతికి సినిమాలు విడుద‌ల కానివ్వ‌మ‌ని, అమ‌రావ‌తికి మ‌ద్ధ‌తు ప‌ల‌కాల్సిందేన‌ని కూడా అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. కానీ మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు విడుద‌ల‌యినా వారిద్ద‌రూ అమ‌రావ‌తి వంటి రాజ‌కీయ అంశాల‌లో జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్ప‌టికే త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి ఇంటి ముందు మాత్రం ధర్నా చేస్తామ‌ని చెప్ప‌డం ద్వారా అమ‌రావ‌తి జేఏసీ రాజ‌కీయాలు ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతాయ‌ని చిరంజీవి అభిమానులు చెబుతున్నారు.

తెలంగాణాలో నివసిస్తున్న చిరంజీవి ఇంటి ముందు దీక్ష‌కు దిగే ముందు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బాల‌కృష్ణ ని ఎందుకు నిల‌దీయ‌డం లేద‌న్న‌ది అమ‌రావ‌తి జేఏసీ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో స‌భ్యుడిగా ఉన్న బాల‌కృష్ణ ఒక్క‌సారి కూడా అమ‌రావ‌తి ఉద్య‌మం వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. గ‌తంలో ఆయ‌న వ‌స్తున్న‌ట్టు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్న అభిమానుల‌కు నిరాశ కూడా త‌ప్ప‌లేదు. అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బాల‌య్య రాక‌పోయినా నోరు మెద‌ప‌ని నేత‌లు, పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌పై త‌న అభిప్రాయాన్ని చెప్పిన త‌ర్వాత చిరంజీవి ఇంటి ముందు దీక్ష‌కు పూనుకుంటామ‌ని అన‌డం ద్వారా ఒక సామాజిక‌వ‌ర్గం మీద గురిపెట్టిన‌ట్టుగా ఉంద‌ని చిరంజీవి అభిమాన సంఘం నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒకే కులానికి చెందిన వారు కేంద్రీక‌రించ‌బ‌డిన కార‌ణంగానే అమ‌రావ‌తి త‌ర‌లిపోతున్నట్టు స్ప‌ష్టం అవుతున్నా ఇంకా వారి తీరు మార్చుకోక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో సాగుతున్న జేఏసీ ఇలాంటి చౌక‌బారు ప్ర‌య‌త్నాలు చేయ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని పలువురు రాజ‌ధాని వాసులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. సంబంధం లేని చిరంజీవి మీద యుద్ధం అంటూ ఉద్య‌మాన్ని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం వాడుకోవ‌డం త‌గ‌ద‌ని చెబుతున్నారు. రాజకీయంగా చిరంజీవి మ‌రోసారి క్రియాశీల‌కంగా మారే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో ఆయన్ని అడ్డుకునే కుట్ర ఉంద‌న అబిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప్ర‌య‌త్నాల ద్వారా అమ‌రావ‌తి జేఏసీ ఉద్య‌మం మ‌రింత నీరుగారుతుంద‌ని గుర్తించాల‌ని సూచిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఈ నిరాహార‌దీక్ష ప్ర‌య‌త్నాల‌పై జేఏసీలో కూడా మ‌ల్ల‌గుల్లాల త‌ర్వాత విర‌మించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి