iDreamPost

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. ఒప్పుకున్న చంద్రబాబు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. ఒప్పుకున్న చంద్రబాబు

అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ వేలాది ఎకరాల భూములు టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం కూడా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో దాదాపు 4070 ఎకరాల భూమి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆధార సహితంగా నివేదిక రూపొందించింది. దాదాపు 800మంది తెల్ల రేషన్‌ కార్డుదారుల పేరుతోనూ భూములు రిజిస్ట్రేషన్‌ జరిగాయంటూ పేర్కొంది.

ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌ ఏమీ జరగలేదని, కావాలంటే విచారణ చేసుకుని దోషులపై చర్యలు తీసుకోవాలంటూ.. ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రులు శాసన సభలోనూ, బయటా సవాళ్లు విసిరాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరు చెప్పి.. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ.. సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు సంధించారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు బదులుగా టీడీపీ.. విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ కొత్తపాట అందుకుంది.

సవాళ్లు, ప్రతిసవాళ్ల తర్వాత అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ లోపు రాజధాని గ్రామాలకు చెందిన దళిత మహిళ లక్ష్మీ ఫిర్యాదు మేరకు రంగంలోని దిగిన సీఐడీ.. మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పల్లారావులతోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసింది. ఈ ఏడుగురు తెల్లరేషన్‌కార్డుదారులు కావడం గమనార్హం. అమరావతి ప్రకటనకు ముందే భూములు కొన్న మొత్తం తెల్ల రేషన్‌కార్డుదారుల వివరాలను సీఐడీ.. ఈడీకి పంపింది. ఈ అంశంపై ఈడీ కూడా దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో గత వారం పదిరోజులుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కొత్త పల్లవి అందుకున్నారు. విచారణజరపండి..తప్పుంటే దోషులపై చర్యలు తీసుకోండి.. మేమేం భయపడం.. అంటూ డాంభికాలు పలికిన చంద్రబాబు.. తాజాగా తెల్లరేషన్‌కార్డుదారులు ఓ అరెకరం భూమి కొనుక్కుంటే ఇన్‌సైడర్‌ ట్రేడింగా..? ఏం తెల్ల రేషన్‌కార్డుదారులు భూమి కొనుక్కొకూడదా..? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిన్నమొన్నటి వరకు అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఏమీ జరగలేదని, దమ్ముంటే విచారణ జరిపించాలని సవాళ్లు విసిరిన చంద్రబాబు.. తాజాగా స్వరం మార్చడంలో ఆంతర్యమేమిటో చెప్పనక్కర్లేదు. తెల్లరేషన్‌కార్డుదారులు అరెకరం భూమి కొనుక్కొకూడదా.. అంటూ చంద్రబాబు మాట్లాడడంతోనే.. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆయనే పరోక్షంగా ఒప్పుకున్నట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి