iDreamPost

50 ఏళ్ళ తర్వాత అక్కినేని సెంటిమెంట్

50 ఏళ్ళ తర్వాత అక్కినేని సెంటిమెంట్

నిన్న ట్రైలర్ వచ్చాక లవ్ స్టోరీ మీద ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ గా అనిపించడం, నాగ చైతన్య తెలంగాణ స్లాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడం, అదరగొట్టిన సాయిపల్లవి డాన్స్ వగైరా అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచేశాయి. సీటిమార్ ఉన్నట్టుండి స్లో అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పూర్తిగా రావడం లేదని గుర్తించిన ట్రేడ్ ఇప్పుడు ఆశలన్నీ లవ్ స్టోరీ మీదే పెట్టుకుంది. కుటుంబాలను హాళ్లకు రప్పించే కంటెంట్ ఇందులో ఉందనే నమ్మకం వాళ్లలో వ్యక్తమవుతోంది. దీని విడుదలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విశేషం ఉంది.

సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం వచ్చిన అక్కినేని నాగేశ్వర్ రావు ఎవర్ గ్రీన్ క్లాసిక్ ప్రేమ నగర్ 1971 సెప్టెంబర్ 24న రిలీజై రికార్డులు సృష్టించింది. ఫ్లాపులతో సతమతమవుతూ చావో రేవో తేల్చుకోవడానికి డిసైడ్ అయిపోయి నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తీసిన ఈ అద్భుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇందులో విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశారు. ఇప్పటికీ పాటలు మరపురాని ఆణిముత్యాలుగా జెనరేషన్ తో సంబంధం లేకుండా ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అర్ధ శతాబ్దం తర్వాత ఏఎన్ఆర్ మనవడికి అదే డేట్ దక్కడం కాకతాళీయమే అయినా విశేషమే.

అందుకే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ట్వీట్ చేసి మరీ అభిమానులతో పంచుకోవడం గమనార్హం. లవ్ స్టోరీ కూడా ప్రేమ్ నగర్ తరహాలోనే గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం ఫాన్స్ లో వ్యక్తమవుతోంది. ఈ నెల 24న చెప్పుకోదగ్గ పోటీ ఏదీ బాక్సాఫీస్ వద్ద లేకపోవడంతో నాగ చైతన్య కెరీర్ లోనే అతి పెద్ద రిలీజ్ లవ్ స్టోరీకి దక్కనుంది. ఓపెనింగ్స్ బాగా వచ్చి టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం వసూళ్లకు ఆకాశమే హద్దని చెప్పొచ్చు. మ్యూజికల్ గా ఇప్పటికే చార్ట్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ఎంతైనా బాక్సాఫీస్ కు ఊపిరినివ్వడం చాలా అవసరం. మిగిలిన నిర్మాతలకూ ధైర్యం వచ్చి డేట్లు ప్రకటించేందుకు రెడీ అవుతారు

Also Read : బాలకృష్ణ సినిమాకు ఊహించని పేరు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి