iDreamPost

ఏజెంట్ కు స్టార్ సమస్య

ఏజెంట్ కు స్టార్ సమస్య

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే ఏజెంట్ లో కీలకమైన విలన్ క్యారెక్టర్ కోసం గట్టి కసరత్తే జరుగుతోందట. ధృవ సినిమాలో అరవింద్ స్వామి తరహాలో చాలా స్టైలిష్ గా దీన్ని డిజైన్ చేశారట. అయితే దీనికి పవర్ ఫుల్ ఆర్టిస్ట్ ని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిందని ఇన్ సైడ్ టాక్. ముందు మోహన్ లాల్ అనుకున్నా ఆయన నో చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు మమ్ముట్టి పేరు తెరపైకి వచ్చింది. ఇది నిజమయ్యే ఛాన్స్ తక్కువ. సోలో హీరోగానే ఇప్పటికీ మలయాళంలో యమా బిజీగా ఉన్న మమ్ముట్టి అక్కడి యూత్ హీరోలతో కలిసి నటించింది కూడా చాలా అరుదు. అలాంటప్పుడు ఏజెంట్ చేయడం అనుమానమే.

పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందబోయే ఏజెంట్ మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటిదాకా వరసగా నాలుగు లవ్ స్టోరీస్ చేసి సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్ కి ఇది హిట్ కావడం చాలా అవసరం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంకా రిలీజ్ కానప్పటికీ ఫ్యాన్స్ కి దాని మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఒకవేళ సక్సెస్ అయితే మహాభాగ్యం అనుకుంటారు. దానికన్నా ఏజెంట్ తోనే మాస్ హీరోగా మార్కెట్ లో నిలవాలని వాళ్ళ కోరిక. మమ్ముట్టి లాంటి స్టార్లు ఉంటే వేల్యూ పెరుగుతుంది కానీ అంత సులభంగా ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి. ఇంకా చర్చల దశలోనే ఉంధీ వ్యవహారం.

ఏజెంట్ లో అఖిల్ స్పై గా కనిపించబోతున్నాడని సమాచారం. వేర్వేరు దేశాల్లో రిస్కీ ఫైట్లు యాక్షన్ ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వల్ల మారిన సమీకరణాలతో అసలు రెగ్యులర్ షూటింగ్ ఇంకా సవ్యంగా జరగడం లేదు. సో వాయిదా తప్పక పోవచ్చు. సైరా నరసింహారెడ్డి తర్వాత గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి ఇంత కాలం ఏజెంట్ స్క్రిప్ట్ మీదే వర్క్ చేశారు. యుఎస్ వెళ్ళినప్పుడు ఈ పని మీదే ఉన్నారు. కిక్ రేస్ గుర్రం ర్తరహా ఎంటర్ టైన్మెంట్ తో పాటు అతనొక్కడే టైపు యాక్షన్ డ్రామా మిక్స్ చేసి అఖిల్ ని డిఫరెంట్ గా చూపిస్తారంట. దీంతో అయినా అఖిల్ కి బ్లాక్ బస్టర్ దక్కుతుందేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి