iDreamPost

చప్పుడే లేదు అయినా 200 కోట్లు

చప్పుడే లేదు అయినా 200 కోట్లు

మన దగ్గర మరీ భారీ మార్కెట్ లేదు కానీ అజిత్ కు తెలుగులోనూ చెప్పుకోదగ్గ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రేమలేఖ టైంలో ఇక్కడ దక్కించుకున్న సక్సెస్ తర్వాత డబ్బింగ్ సినిమాలు కంటిన్యూ చేయకపోవడంతో టాలీవుడ్ లో పెద్దగా ముద్ర వేయలేదు కానీ ఇతని చిత్రాల్లో అధిక శాతం రీమేకులు కావడం కూడా ఒకరకంగా శాపంగా మారింది. తెలుగు సినిమా ప్రేమ పుస్తకంతో నటనలో తొలి అడుగులు వేసిన అజిత్ ఇక్కడ కాకుండా తమిళనాట ఇంత స్థాయికి ఎదుగుతాడని ఆ ఓపెనింగ్ కి వచ్చిన చిరంజీవి కూడా ఊహించి ఉండరు. విజయ్ అభిమానులు అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో యుద్ధాలు చేసుకుంటారో ఓసారి ట్విట్టర్ లో చూస్తే అర్థమవుతుంది.

ఇక తాజాగా నిర్మాణంలో ఉన్న వలిమై సుమారు 200 కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్నట్టు వచ్చిన వార్త ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ సౌత్ ఇండియన్ మూవీకి ఈ స్థాయిలో జరగలేదు. దెబ్బకు విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బీస్ట్ ని 250 కోట్లకు అమ్మేలా నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నారని చెన్నై మీడియా కోడై కూస్తోంది. అసలు వలిమై టైటిల్ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇదిగొ అదిగో అంటూ ఫస్ట్ లుక్ వాయిదా వేస్తూ పోతున్నారు తప్ప కనీసం ఎప్పుడు వదిలేది కూడా చెప్పడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి నిర్మాత బోనీ కపూర్ దర్శకుడు వినోత్ తప్పించుకుంటూ వస్తున్నారు.

వలిమైలో మన ఆరెక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా నటించడం మరో ఆకర్షణ. హ్యూమా ఖురేషి హీరోయిన్ అయినప్పటికీ గ్లామర్ పరంగా అజిత్ కు ఇందులో ఎలాంటి లవ్ ట్రాక్ కానీ అవసరం లేని పాటలు కానీ పెట్టలేదని తెలిసింది. ఇదంతా చూస్తుంటే సౌత్ సినిమా స్థాయి ఎక్కడికి వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి లాంటి ఫాంటసీ మూవీ గ్రాఫిక్స్ వండర్ కు వందల కోట్లు కుమ్మరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వలిమై ఒక కమర్షియల్ పోలీస్ డ్రామా. అయినా కూడా ఈ క్రేజ్ చూస్తుంటే వామ్మో అనిపించక మానదు.వలిమై తెలుగు హక్కులు ఎవరికి ఇవ్వబోతున్నారో ఇంకా లీక్ చేయలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి