iDreamPost

గాల్లోకి ఎగిరిన విమానాన్ని వెనక్కి రప్పించిన ఉల్లిగడ్డ! అసలేమైందంటే?

  • Author Soma Sekhar Published - 08:28 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 08:28 PM, Thu - 3 August 23
గాల్లోకి ఎగిరిన విమానాన్ని వెనక్కి రప్పించిన ఉల్లిగడ్డ! అసలేమైందంటే?

సాధారణంగా విమానాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడో, లేదా బాంబు బెదిరింపులు వచ్చినప్పుడో అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. అయితే విమానాశ్రయంలో టేకాఫ్ అయి ప్రశాంతంగా ప్రయాణిస్తున్న ఓ విమానం ఉల్లిగడ్డ కారణంగా మళ్లీ రిటర్న్ అయ్యి అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అదేంటి టెక్నికల్, బెదిరింపు కాల్స్ వస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారుగానీ.. ఈ ఉల్లిగడ్డ వల్ల ఫ్లైట్ వెనక్కి తిరిగిరావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అసలు ఈ ఉల్లిగడ్డ విమానాన్ని ఎలా వెనక్కిరప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

175 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కొచ్చి నుంచి షార్జాకు ఆగస్టు 2వ తేదీ రాత్రి బయలుదేరింది. అంతా సవ్యంగా ఉండటంతో కొచ్చి ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది ఫ్లైట్. అలా కొంతదూరం గాల్లో ప్రయాణించింది విమానం. ఇంతలోనే ఓ ప్రయాణికుడికి ఏదో ఘాటైన వాసన వచ్చింది. అతడు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించాడు. ఆ తర్వాత మరో ప్రయాణికుడు సైతం ఇలాగే ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఆ ఘాటైన వాసన ఫ్లైట్ మెుత్తం వ్యాపించింది. దీంతో విమానంలోని ప్రయాణికులలో ఒక్కసారిగా అలజడి మెుదలైంది.

ఈ క్రమంలోనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించాడు. అదీకాక విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లిస్తున్నట్లు కెప్టెన్ ప్రకటించాడు. ఫ్లైట్ ను తిరిగి కొచ్చి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేస్తానని కెప్టెన్ ప్రకటించగానే.. ప్రయాణికుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. చివరికి కొచ్చి ఎయిర్ పోర్ట్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే టెక్నికల్ టీమ్ విమానం మెుత్తాన్ని తనిఖీ చేసింది. కానీ ఎక్కడా అగ్నిప్రమాదం గానీ, పొగ, సాంకేతికత సమస్య తలెత్తలేదని గుర్తించింది.

ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల్లో కూరగాయలు, పండ్లు, పూలు తరలించేందుకు కార్గో ఏరియా ఉంటుంది. విమానంలో ఎలాంటి సమస్య లేకపోవడంతో.. సెర్చ్ టీమ్ కార్గోలో తనిఖీలు చేపట్టింది. చివరికి ఆ కార్గోలో ఉన్న ఓ బాక్స్ లో ఉల్లిగడ్డలు కనిపించాయి. ఆ ఘాటైన వాసన ఉల్లిగడ్డలదే అని నిర్ధారించారు సెర్చ్ సిబ్బంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ విమానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కులల్ నాదన్ కూడ ఉన్నారు. కానీ ఆయన విమానం ఎక్కగానే పడుకున్నానని, విమానం కొచ్చిలో ల్యాండ్ అవ్వగానే లేచానని చెప్పుకొచ్చాడు. మరి ఈ విచిత్రమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తల్లి ఆఫర్.. ఏడాదిలో 100 మందితో కూతురు డేటింగ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి