iDreamPost

మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన MIM.. కారణం ఇదే

  • Published Sep 20, 2023 | 11:00 AMUpdated Sep 20, 2023 | 11:35 AM
  • Published Sep 20, 2023 | 11:00 AMUpdated Sep 20, 2023 | 11:35 AM
మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన MIM.. కారణం ఇదే

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం లభించనుంది. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్త పార్లమెంట్ హౌస్‌లో తొలి రోజు సెషన్ ప్రారంభమైన వెంటనే అనగా సెప్టెంబర్ 19వ తేదీన మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బుధవారం చర్చ జరుగనుంది. బిల్లు ఆమోదం పొందుతుందని మెజారిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అందుకు గల కారణాలను వివరించారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు, ఓబీసీ వర్గాలకు కోటా కేటాయించలేదని.. ఇది అన్యాయం అన్నారు. ఈ కారణంగానే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఎంపీ అసదుద్దీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు(కేంద్ర ప్రభుత్వం) తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి ప్రాముఖ్యత కల్పించేలా బిల్లును తీసుకు వస్తున్నారు. అయితే మన దేశంలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8,992 మంది ఎంపీలు ఎన్నికైతే.. అందులో 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. అంటే సుమారు 50 శాతానికి పైగా లోటు ఉంది’’ అని తెలిపారు

‘‘ఇక ఆ 520 మందిలోనూ స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముస్లిం మహిళలు కనీసం గుప్పెడు మంది కూడా లేరు. మరి మీరు ఈ బిల్లు ద్వారా ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనుకుంటున్నారు.. అవసరం ఉన్నవారికి ప్రాతినిథ్యం ఇవ్వాలి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ముస్లిం, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కోటా లేకపోవడం దీనిలోని ప్రధాన లోపం. అందుకే ఈ బిల్లును మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం” అని స్పష్టం చేశారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి