iDreamPost

భారత సైన్యంలో ‘అగ్నివీరులు’, నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసే అవ‌కాశ‌మిచ్చే ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రారంభం

భారత సైన్యంలో ‘అగ్నివీరులు’,  నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసే అవ‌కాశ‌మిచ్చే ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రారంభం

భార‌తీయ సైన్య‌పు రిక్రూట్ మెంట్ విధానం వేగంగా మార‌నుంది. యువతకు దేశ సేవ చేసే అవకాశం కల్పించేందుకు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
ఇండియ‌న్ ఆర్మీకి చురుకుపుట్టించేందుకు, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం దేశ యువతను వినియోగించుకోవాల‌న్న‌ది కేంద్ర భావ‌న‌.

ప్రస్తుతం అబ్బాయిలకే మాత్రమే అవకాశం. అమ్మాయిలకు తరువాత అవకాశం కల్పిస్తారు. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్యనున్న‌వారు సైనికులు కావ‌చ్చు. తొలి ఏడాది రూ.4.76 లక్షల ప్యాకేజీ చెల్లిస్తారు. నాలుగో ఏడాదిలో రూ.6.92 లక్షలు బ్యాంక్ లో ప‌డ‌తాయి. అంటే నెల‌కు రూ.30,000-40,000. అల‌వెన్స్ లు ఉంటాయి.

ఈ పథకం ద్వారా ఆర్మీలో చేరి, నాలుగుళ్ల కాలాన్ని పూర్తిచేసుకున్న‌వాళ్ల‌లో 25 శాతం మందిని తర్వాత రీటెయిన్ చేస్తారు. అంటే 100లో 25 మంది మిల‌ట‌రీలో ప‌ర్మినెంట్ అవుతారు. అందుకే అగ్నివీరులంతా భవిష్యత్తు సైనికులు అవుతారుకాబ‌ట్టి, కఠినమైన పద్ధతిలో వారి నియామకాలు చేపడతారు.

ఈ అగ్నివీరులు ఆల్ ఇండియా, ఆల్ క్లాసుల్లో ప‌నిచేస్తారు. వీళ్ల‌కు ప్ర‌త్యేకంగా ర్యాంక్ , ప్రత్యేక చిహ్నం ఉంటుంది. వీళ్ల‌ను చూడ‌గానే అగ్నివీరుల‌ని తెలిసిపోయే ప్ర‌త్యేక కోడ్ ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత కొన‌సాగితే, రెగ్యుల‌ర్ ఆర్మీలో క‌లుస్తారు.

ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ర‌క్ష‌ణ‌రంగ కేబినేట్ క‌మిటీ అగ్నిప‌థ్ ప‌థ‌కానికి ఆమోద‌ముద్ర‌వేసింది. రిక్రూట్ మెంట్ 90రోజుల్లో మొద‌ల‌వుతుంది. మొత్తం మీద 46వేల మందిని అగ్నివీరులుగా తీసుకొంటారు. ఇప్ప‌టిదాకా ఎవ‌రినైనా సైన్యంలోకి ఎంపిక చేస్తే వాళ్ల‌ను ఆయా రెజిమెంట్స్ లోకి తీసుకొనేవాళ్లు. కాని అగ్నిప‌థ్ స్కీమ్ కింద చేరిన వాళ్ల‌ను అగ్నివీరులుగా పిలుస్తారు.

త్రివిధ‌ద‌ళాల అవ‌స‌రాల‌ను బ‌ట్టి శారీర‌క ధారుడ్యాన్ని చూస్తారు. ఒక‌సారి సెల‌క్ట్ ఐతే, వాళ్ల‌ను ఏ రిజ‌మెంట్, యూనిట్ కైనా పంపుతారు.

నాలుగేళ్ల కాలం పూర్త‌యిన త‌ర్వాత, సేవానిధి ప్యాకేజ్ క్రింద రూ.11.71ల‌క్ష‌ల‌ను చెల్లిస్తారు. దీనిపై ఎలాంటి టాక్స్ ఉండ‌దు. ఇందులో నెల‌వారీ శాల‌రీల నుంచి క‌ట్ చేసిన మొత్తంతోపాటు, ప్ర‌భుత్వం వాటాకూడా క‌లిపే ఉంటుంది. దానితోపాటు రూ.48ల‌క్ష‌ల విలువైన ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.

స‌ర్వీసులో ప్ర‌మాద‌వ‌శాస్తూ చ‌నిపోతే అద‌నంగా రూ.44 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ఇస్తారు. ఒక‌వేళ విక‌లాంగులైతే, ఇప్పుడున్న విధానంలో ప‌రిహారాన్నిఅందిస్తారు.

నాలుగేళ్ల త‌ర్వాత అగ్నివీర్ స్కిల్ స‌ర్టిఫికేట్ ను అందిస్తారు. అంతేకాదు, రూ.18.2 లక్ష‌ల బ్యాంక్ లోన్ తీసుకొనే అవకాశ‌మూ ఉంది.

కాని ఈ అగ్నివీరుల‌కు ఎలాంటి పెన్ష‌న్ ఉండ‌దు. గ్రాట్యూటీ లేదు. పెన్ష‌న్ భారాన్ని త‌గ్గించుకొనేందుకు కేంద్రం చేసిన ఎర్పాటే అగ్నిప‌థ్ ప‌థ‌కం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి