iDreamPost

చెల్లని నాలుగో ఓటు ఆ టీడీపీ ఎమ్మెల్యేది..!

చెల్లని నాలుగో ఓటు ఆ టీడీపీ ఎమ్మెల్యేది..!

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో నాలుగు ఓట్లు చెల్లని విషయం తెలిసిందే. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు ఏసీబీ అరెస్ట్‌ కారణంగా, మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలవడంతో స్వతహాగా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు చెల్లినవిగా కౌంటింగ్‌ అధికారులు తేల్చారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. ఈ నాలుగు ఓట్లు టీడీపీ ఎమ్మెల్యేలవని అధికారులు తేల్చారు.

టీడీపీకి పడిన నాలుగు చెల్లని ఓట్లలో మూడు ఓట్లు ఎవరివి అనే అంశంపై వెంటనే అందరూ ఓ క్లారిటీకి వచ్చారు. టీడీపీని వీడిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలవని అందరూ అంచనా వేశారు. అయితే చెల్లని ఆ నాలుగో ఓటు ఎవరిది..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ నేతల్లోనూ నాలుగో చెల్లని ఓటు ఎవరిదన్న విషయంపై చర్చ సాగింది.

చెల్లని ఓట్లపై జరుగుతున్న చర్చ, ఉత్కంఠకు తెరదించేలా అధికారులు వివరాలు వెల్లడించారు. ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలతోపాటు నాలుగో ఓటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిది అని తేల్చారు. అవగాహన లోపంతో పొరపాటున మొదటి ప్రాధాన్యత ఓటు ఎదురుగా టిక్‌ చేయడంతో ఆమె ఓటు చెల్లకుండా పోయింది. దివంగత మాజీ ఎంపీ కింజారపు ఎర్రం నాయుడు కుమార్తె అయిన ఆదిరెడ్డి భవాని గత ఎన్నికల్లో తొలిసారి రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇటీవల ఆమె బాబాయి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు ఏసీబీ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈమె తమ్ముడు కింజారపు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి