iDreamPost

ఏపీలో వేట మొదలవబోతోంది

ఏపీలో వేట మొదలవబోతోంది

అవినీతి లేని పరిపాలన అందిస్తానని ఎన్నికల సభల్లో చెప్పిన మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రి నంబర్‌ 14400ను ఏర్పాటు చేశారు. ఉత్సాహవంతుడైన అధికారిని ఏసీబీకి బాస్‌గా నియమించారు. తన స్థాయిలో అవినీతి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాని, ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాధికారుల అవినీతిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఏసీబీదేనని ఇటీవల సీఎం జగన్‌ చెప్పారు.

సీఎం జగన్‌ లక్ష్యానికి అనుగుణంగా ఏసీబీ పని చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా వరుస దాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సబ్‌ రిజిస్ట్రార్, రెవెన్యూ, మున్సిపల్, తాజాగా వైద్య శాఖ కార్యాలయాలపై దాడులు చేసింది. టోల్‌ ఫ్రి నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా అవినీతి అధికారులను వల పన్ని పట్టుకుటోంది. ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు బాధ్యతలు తీసుకున్న రెండునెలల్లో ఏసీబీ సాధించిన ప్రగతి.

ఇప్పుడు ఏసీబీ బాస్‌ మరో కొత్త ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదులు, ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు 2019 జూన్‌ నుంచి అవినీతి ఆరోపణలపై అరెస్ట్, సస్పెండ్‌ అయిన అధికారులు వివరాలు కూడా ఇవ్వాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులున్న అధికారుల వివరాలను ఏసీబీ బాస్‌ అడగడంతో అమ్యామ్యాలు భోంచేసిన అధికారుల హడలెత్తిపోతున్నారు. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ ఆయా అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే వివరాలు అడిగారని అంచనా వేస్తున్నారు. ఇదేగాని జరిగితే.. ఒక్కొక్క అధికారి నుంచి కోట్ల రూపాయల ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ఎక్కువ.. తక్కువ అనే వ్యత్యాసం తప్పా.. ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన విభాగాలైన రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, మున్సిపల్‌ రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ తదితర విభాగాల్లో అవినీతి ఏరులై పారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి