iDreamPost

ఆరడుగుల బుల్లెట్ రిపోర్ట్

ఆరడుగుల బుల్లెట్ రిపోర్ట్

ఒక సినిమా అయిదేళ్లకు పైగా ల్యాబులో మగ్గి విడుదలవుతోందంటే దాని మీద ఆసక్తి సన్నగిల్లడం సహజం. అయితే అంచనాలు మించి కనక సదరు చిత్రం ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి లవకుశ, అమ్మోరు లాంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంజి కూడా ఇదే కోవలోకి వస్తుంది కానీ హంగులు ఎక్కువైపోయి కంటెంట్ తగ్గిపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. ఒకపక్క ఇప్పటి దర్శకులు నిర్మాణ వేగాన్ని పెంచుతూ కొండపొలం, దృశ్యం 2 లాంటి వాటిని 45 రోజుల్లో పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తుండగా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని తరహాలో పదే పదే వాయిదా పడుతూ వచ్చిన ఆరడుగుల బుల్లెట్ నిన్న వచ్చింది. రిపోర్ట్ చూద్దాం

రేసు గుర్రం, కిక్ లాంటి బ్లాక్ బస్టర్లకు కథలు అందించిన వక్కంతం వంశీ దీనికి రచయిత. ఇది చెప్పే నాటికి కమర్షియల్ ఫార్ములాలు వర్కౌట్ అవుతున్నాయేమో కానీ ఇప్పుడు మాత్రం ఇదంతా అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. అనగనగా ఒక కొడుకు. పెద్దగా బాధ్యతలను పట్టించుకోడు. నాన్నకు ఇతను సెటిల్ కావడం లేదని కోపం. కట్ చేస్తే విలన్ ఎంట్రీ. సదరు హీరో తండ్రి ల్యాండ్ మీద కన్నేస్తాడు. ఆటోమేటిక్ గా క్లాష్ వచ్చేస్తుంది. మన బుల్లెట్ కి బాధ్యతలు గుర్తొచ్చేసి వాడి అంతు చూసేందుకు కంకణం కట్టుకుంటాడు. చివరికి ఈజీగా ఊహించుకోగలిగే క్లైమాక్స్ తో తెరమీద శుభం కార్డు, మన మనసులో నిట్టూర్పు ఒకేసారి పడతాయి.

ఒకప్పుడు మాస్ మసాలా సినిమాలతో బాక్సాఫీస్ ని ఏలిన దర్శకులు బి గోపాల్ ఇందులోనూ తన స్టైల్ మేకింగ్ చూపించారు కానీ అదంతా ఓ ఇరవై ఏళ్ళ వెనక్కు తీసుకెళుతుంది. ఫస్ట్ హాఫ్ సోసోగా రెగ్యులర్ ఆడియన్స్ కి ఓ మాదిరిగా టైం పాస్ చేయించినా రెండో సగం మాత్రం రొట్ట రొటీన్ దారిలో వెళ్ళిపోయి విసుగు తెప్పిస్తుంది. మణిశర్మ పాటల్లో కానీ బిజిఎంలో కానీ ఎలాంటి మెరుపులు లేవు. నయనతార సైతం నిస్సహాయంగా మిగిలిపోయింది. గోపీచంద్, ప్రకాష్ రాజ్ లు తమ పాత్రలను నిలబెట్టారు కానీ వీక్ కంటెంట్ వల్ల వాళ్ళ కష్టం వృథా అయ్యింది. మన మైండ్ సెట్ ఇంకో పాతికేళ్ల వెనక్కే ఉందంటే మాత్రం ఇది చూడాల్సిన సినిమానే

Also Read : అబార్షన్లు, అఫైర్లు అంటూ రూమర్లు… గడ్డి పెట్టిన సమంత

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి