iDreamPost

Aamir Khan : లాల్ సింగ్ ది గ్రేట్ – క్షమాపణ కోరాడు

Aamir Khan : లాల్ సింగ్ ది గ్రేట్ –  క్షమాపణ కోరాడు

మొన్న ఉన్నట్టుండి హఠాత్తుగా ఏప్రిల్ 14 విడుదల తేదీ ప్రకటించి కెజిఎఫ్ 2 టీమ్ నెత్తి మీద పిడుగు పడేసిన లాల్ సింగ్ చద్దా టీమ్ తరఫున అమీర్ ఖాన్ క్షమాపణ కోరాడు. వ్యక్తిగతంగా వేరొకరి సినిమా ఫిక్స్ చేసుకున్న డేట్ కి తన చిత్రాన్ని క్లాష్ చేయించడం ఇష్టం ఉండదని, కానీ లాల్ సింగ్ చద్దాలో హీరో సిఖ్ పాత్రదారి కావడంతో బైసఖి పండగను పురస్కరించుకుని అప్పుడు రిలీజ్ చేయడమే సబబుగా ఉంటుందని టీమ్ భావించడం వల్లే ఒప్పుకున్నానని మీడియాతో చెప్పాడు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అయ్యిందని కాబట్టే పోస్ట్ పోన్ తప్పలేదని వివరణ ఇచ్చుకున్నాడు అమీర్ ఖాన్.

ఇక్కడితో అయిపోలేదు. హీరో యష్ తో పాటు కెజిఎఫ్ దర్శక నిర్మాతలతో మాట్లాడి వాళ్లకు నిర్ణయం చెప్పి ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్నాకే ప్రకటన ఇచ్చామని చెప్పడం గమనార్హం. వ్యక్తిగతంగా తనకు ఆ సినిమా చాలా ఇష్టమని, చాప్టర్ 2ని అదే రోజు థియేటర్లో చూస్తానని చెప్పడమే కాదు ప్రత్యేకంగా ప్రమోషన్ కూడా చేస్తానని చెప్పడం మరో ట్విస్టు. నిజానికి లాల్ సింగ్ చద్దా రావడం వల్ల నార్త్ లో కెజిఎఫ్ 2కు థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. మూడేళ్ళ తర్వాత వస్తున్న అమీర్ ఖాన్ మూవీ కాబట్టి ట్రేడ్ తో పాటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకే అమీర్ ఖాన్ ఇంత ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంది.

నిజానికి ఇదంతా అవసరం లేదు. ఒకరు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాక ఇంకొకరు రాకూడదన్న రూల్ ఏమి లేదు. తెలుగులోనే చూసుకుంటే ఇక్కడ పోటాపోటీగా ఎంత కాంపిటీషన్ కి సిద్ధపడుతున్నారో కళ్లారా చూస్తున్నాం. నువ్వా నేనా అనే రీతిలో ఎవరూ తగ్గడం లేదు. క్షమాపణలు లాంటివి కలలో మాటే. ఇక్కడే అమీర్ ఖాన్ వ్యక్తిత్వం ఆకట్టుకుంటోంది. తనకు సంబంధం లేని రిలీజ్ వ్యవహారం గురించి అది కూడా ఒక డబ్బింగ్ సినిమా యూనిట్ కు సారీ చెప్పడం అంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమే. రెండూ బాగా ఆడటమే ఇప్పుడు అందరికీ కావాల్సింది. లాల్ సింగ్ చద్దాకు దర్శకుడు అద్వైత్ చందన్.

Also Read : Prabhas : ఇంత రెమ్యునరేషన్ ఇంకో స్టార్ కు సాధ్యమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి