iDreamPost

వైసీపీ-బీజేపీ బంధం ఇద్దరికీ అవసరమే

వైసీపీ-బీజేపీ బంధం ఇద్దరికీ అవసరమే

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే మూడుముళ్ల బంధం ఏర్పడనుంది. మొన్నీమధ్యనే నిశ్చయ తాంబూలాలు అయ్యాయి.వాస్తవానికి ఈ సంబంధం గత కొన్ని నెలలుగా బలపడుతూ వస్తోంది. ఇరువైపుల నుండి మాటలు జరుగుతున్నాయి. ఒక అంగీకారానికి దాదాపు వచ్చినట్టే. బయటకు చెప్పడం లేదుకానీ ఇప్పటికే ఉంగరాలు మార్చేసుకున్నారు.

ఈ వారంలో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంబంధాన్ని దాదాపు ఖాయం చేశారు. ఇచ్చిపుచ్చుకోవడలపై ఒక అంగీకారం కుదిరితే ఇక లగ్నపత్రిక రాసుకోవడం పూర్తవుతుందని ఇద్దరికీ కావలసినవాళ్ళు చెప్పుకుంటున్నారు.ఒక రకంగా చూస్తే ఈ బంధం అటు బీజేపీకి, ఇటు వైసీపీకి తప్పదనిపిస్తోంది. ఇద్దరిపరిస్థితి దాదాపు ఒక్కటే.బీజేపీ వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతూ ఈ ఐదేళ్ళు పూర్తయ్యేనాటికి రాజ్యసభలో ఆధిక్యత సాధించే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా స్థానికంగా ఉన్న ప్రాంతీయపార్టీలు అధికారంలోకి వచ్చాయి.

ఏ రాష్ట్రం నుండీ తన సంఖ్యా బలాన్ని పెంచుకునే అవకాశాలు బీజేపీకి కనిపించడం లేదు. పైగా ఎన్నాళ్ళనుండో స్నేహం కొనసాగిస్తోన్న శివసేన తెగతెంపులు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో నెగ్గాలంటే బీజేపీకి వైసీపీ లాంటి పార్టీల మద్దతు అవసరం.

ప్రస్తుతం రెండు స్థానాలున్న వైసీపీ రేపు ఏప్రిల్ మొదటివారానికి నలుగురు కొత్త సభ్యులతో సభలో తన బలాన్ని ఆరుకు పెంచుకోనుంది. రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం అంటే ఈ పరిస్థితుల్లో బీజేపీ వదులుకోవడం సాధ్యం కాదు. అందుకే తప్పని పరిస్థితుల్లో జగన్ తోడుకోసం బీజేపీ నాయకత్వం తహతహలాడుతోంది.

ఇక జగన్ కు కూడా ఇది తప్పని సరి బంధమే. పాలనకు ఆయన కొత్త. పైగా శత్రువులు ఎక్కువే ఉన్నారు. అందునా శత్రువులంతా ఆర్ధికంగా, రాజకీయంగా చాలా బలమైన వారు. ఇలాంటి శత్రువులను ఎదుర్కోవాలంటే వస్తాదుల్లాంటి మిత్రులు కావాలి. అందుకే మోడీ – అమిత్ షా అండకోసం జగన్ ఎదురు చూస్తున్నారు.

చంద్రబాబు లాంటి నాయకుణ్ణి ఎదుర్కొవాలన్నా, రామోజీ లాంటి వృద్ధ సింహాన్ని, అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాధాకృష్ణ లాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతు తప్పదు. మోడీ – షా పేర్లు చెపితే చెమటలుపట్టే ఈ ముగ్గురికోసం అయినా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో బంధం కలుపుకోవాల్సిందే.

అయితే ఈ బంధం రాష్ట్రంలో రాజకీయాలను ఓ కుదుపు కుదిపే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇప్పుడు జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ తన బంధాన్ని కొనసాగిస్తారా లేక విడిపోతారా అన్నది చూడాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా రాష్ట్రంలో ప్రతిపక్షాలనుండి జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.

అన్నిటికీ మించి తనకు అండగా ఉన్న క్రిస్టియన్లు, ముస్లింలకు జగన్ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో జగన్ బంధాన్ని ఈ రెండువర్గాలూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించవు. ఒకవేళ క్రైస్తవులు జగన్ రాజకీయ అవసరాలను గుర్తించి ఆమోదించినా, ముస్లింలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో బంధాన్ని అంగీకరించరు.. అందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలి.

బీజేపీతో జట్టుకట్టి తన రాజకీయ శత్రువులను ఎదుర్కొనడమో లేక బీజేపీ బంధం కారణంగా క్రైస్తవ, ముస్లిం ప్రజల మద్దతు కోల్పోవడమో … ఎదో ఒక దానికి జగన్మోహన్ రెడ్డి సిద్దపడాల్సిన పరిస్థితి. అటు రాజకీయంగా బీజేపీ అందించే చేయూతను వదులుకోలేడు. అలా అని బీజేపీతో బంధానికి అంగీకరించి మైనారిటీలను దూరం చేసుకోలేడుఈ సంక్లిష్ట స్థితినుండి జగన్మోహన్ రెడ్డి ఎలా బయట పడతాడు, ఎలాంటి రాజనీతి ప్రదర్శిస్తాడు అన్నది వేచిచూడాల్సిందే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి