iDreamPost

కళ్ళు లేవు.. అయినా టాప్ 50లో సివిల్స్ ర్యాంక్ సాధించింది..

కళ్ళు లేవు.. అయినా టాప్ 50లో సివిల్స్ ర్యాంక్ సాధించింది..

ఆమెకు చూడటానికి చిన్నప్పట్నుంచీ కళ్ళు లేవు. అయినా దిగులు పడకుండా కష్టపడి చదివి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించింది. అక్కడితో ఆగకుండా సివిల్స్ ని ప్రయత్నించి సివిల్స్ లో ర్యాంక్ సాధించింది. ఢిల్లీ దగ్గర్లోని రాణిఖేడా అనే గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టింది ఆయుషి. పుట్టుకతోనే అంధురాలు అయినా తల్లితండ్రుల సహాయంతో తన గ్రామంలోనే ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో ఎంఏ (హిస్టరీ), ఢిల్లీ జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. కళ్ళు లేని మహిళ ఇక్కడివరకు రావడమే గొప్ప అనుకున్నారు అంతా.

కానీ 2012లో మున్సిపల్‌ కార్పొరేషన్‌∙స్కూల్లో కాంట్రాక్ట్‌ టీచర్‌గా చేరి ఆ తరువాత 2016లో ప్రైమరీ టీచర్‌ అయ్యింది. 2019లో ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు పరీక్షలు రాసి అందులో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్‌ అయ్యింది. ఒకపక్క టీచర్ గా పని చేస్తూనే మరోపక్క సివిల్స్‌ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా పని చేస్తూనే సివిల్స్ కి ప్రిపేర్ అయింది. ఆయుషి పుట్టుకతోనే అంధురాలు కావడంతో తన తల్లితండ్రులు ఎంతగానో సపోర్ట్ చేశారు. సీనియర్‌ నర్సింగ్‌ అధికారిగా పనిచేసే ఆయుషి తల్లి ఆశారాణి 2020లో వలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఆయుషి ప్రిపరేషన్‌కు సహకరించారు.

సివిల్స్ లో ఇప్పటికే నాలుగు సార్లు విఫలమైంది ఆయుషి. అయినా ప్రయత్నం వదలకుండా చదివి తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్‌ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండా ఈ ర్యాంక్ సాధించడం విశేషం. దీంతో ఆయుషిని అంతా అభినందిస్తున్నారు.

ఈ విజయంపై ఆయుషి మాట్లాడుతూ.. అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయినా నేను ఎప్పుడూ టీచింగ్ ని ఉద్యోగంగా చూడకుండా అభిరుచిగా భావించాను. పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. సివిల్స్‌ క్లియర్‌ చేస్తానని నమ్మకం ఉంది కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొన్నాను. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ ఇవాళ సివిల్స్ సాధించాను. టాప్ 50లో ర్యాంక్ సాధించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటున్నాను అని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి