iDreamPost

చంద్రగిరిలో చెవిరెడ్డి సత్తా.. 78 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం

చంద్రగిరిలో చెవిరెడ్డి సత్తా.. 78 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం

2019 సాధారణ ఎన్నికల సందర్భంగా అధికారం అండగా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. చాలా గ్రామాల్లో సిట్టింగ్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అడుగు కూడా పెట్టనివ్వకుండా గొడవలు సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి పులివర్తినాని దౌర్జన్యాలు చేశారు. దీంతో ఆ నియోజకవర్గం అత్యంత వివాదాస్పదం అయ్యింది. కొన్ని గ్రామాల్లో రీపోలింగ్‌ కూడా జరిగింది. అన్నింటినీ తట్టుకొని చెవిరెడ్డి భాస్కరరెడ్డి 40వేలకు పైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా 78 శాతం ఎంపీటీసీలను ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది.

నియోజకవర్గంలోని చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, యెర్రావారిపాలెం మండలాల పరిధిలో 95 ఎంపీటీసీ స్థానాలు ఉంటే శుక్రవారానికి 76 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకే దక్కాయి. దీంతో దాదాపు 78 శాతం స్థానాలు సొంతం చేసుకున్నట్లు అయ్యింది. తిరుపతి రూరల్‌ మండలంలో 39 ఎంపీటీసీ స్థానాలకు గాను 34 స్థానాలు వైఎస్సార్‌సీపీకే దక్కనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు కూడా గడువు ఉండడంతో.. మరిన్ని ఏకగ్రీవాలకు అవకాశం ఉంది. ఎక్కడా టీడీపీ గెలిచే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ఏకగ్రీవాలు కావడం ఇదే తొలిసారని నేతలు చెబుతున్నారు.

కలసి వస్తున్న ప్రభుత్వ పథకాలు..

కుల, మత, పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతుండడం అధికార పార్టీకి కలసి వస్తోంది. అలాగే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సాయం చేయడంలో చెవిరెడ్డి ఎల్లప్పుడూ ముందు ఉంటారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లే మనస్థత్వమే చెవిరెడ్డిని ప్రజలకు దగ్గర చేసింది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అనుకూల ఫలితాలు వస్తున్నాయి. టీడీపీలో ఉండి చెవిరెడ్డిపై కయ్యానికి కాలుదువ్విన వారు సైతం ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి