iDreamPost

పిడుగుల వర్షం.. 2 గంటల్లో 61 వేల పిడుగులు.. భయంతో ప్రజలు

పిడుగుల వర్షం..  2 గంటల్లో 61 వేల పిడుగులు.. భయంతో ప్రజలు

దేశంలోని పలు రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ముసురు పట్టినట్లు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడం, వాయుగుండాలతో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పుటికే రెండు తెలుగు రాష్ట్రాలను వానలు కుదిపేసిన సంగతి విదితమే. కాగా, తెలంగాణలో మళ్లీ వానలు మొదలయ్యాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ చెరువుల్లా నిండిపోయాయి. మోకాళ్ల లోతులో వరద నీరు పొంగి పొర్లుతోంది. అంత ఎత్తున చేరుకున్న నీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరాల్లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి.

ఒడిశాలోని ప్రజలపై వానలే కాదూ పిడుగులు కూడా పగబట్టాయి. వర్షాల కారణంగా అక్కడ రికార్డు స్థాయిలో పిడుగులు పడ్డాయి. కేవలం 2 అంటే 2 గంటల వ్యవధిలో సుమారు 61వేల పిడుగులు పడ్డాయి. దీంతో సుమారు 12 మంది మరణించారు. 15 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. గజపతి, జగత్ సింగ్పూర్, పూరి, బలంగిర్, పలు జిల్లాల్లో 12 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఇక వందల సంఖ్యలో పశువులు కూడా మృత్యువాత పడ్డాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పాటు శబ్దాలతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు ఇలాంటి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో అల్పపీడంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

2 గంటల్లో 61 వేల పిడుగులు పడటం మునుపెన్నడూ జరగలేదని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సాహూ వెల్లడించారు. పిడుగు పాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. రుతు పవనాలు సాధారణ స్థితికి వచ్చాయని, ఇటువంటి సందర్భంలో పిడుగులు, మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. మరో వారం పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భువనేశ్వర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల వాసులకు కూడా హెచ్చరించారు అధికారులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి