iDreamPost

Akhanda : అఖండ విజయానికి 6 కారణాలు

Akhanda : అఖండ విజయానికి 6 కారణాలు

బాక్సాఫీస్ అఖండ ఫీవర్ తో ఊగిపోతోంది. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. చాలా చోట్ల ఎక్స్ ట్రా షోలు పడుతున్నాయి. ఇప్పటికే సగం పైగా రికవరీ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ వచ్చే వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ దాటడం ఖాయమని ట్రేడ్ పండితుల అంచనా. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఒక్క స్టార్ హీరో కమర్షియల్ చిత్రం రాకపోవడం అఖండకు బ్రహ్మాండంగా కలిసి వస్తోంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో టికెట్ల కోసం జనం తొక్కిసలాట ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఒకసారి ఇంతటి విజయానికి కారణమైన అంశాలను విశ్లేషణ చేస్తే వీటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు

1. బాలయ్య విశ్వరూపం

అఘోరాలు నిజంగా ఇలాంటి గెటప్స్ లో ఉంటారా లేదా అనేది పక్కనపెడితే అఖండ క్యారెక్టర్ లో బాలయ్య విశ్వరూపం మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన మాట వాస్తవం. ప్రీ ఇంటర్వెల్ తో మొదలుపెట్టి క్లైమాక్స్ దాకా ఇది ఏ స్థాయిలో సాగిందంటే అసలు రెండో బాలయ్య పాత్ర మరొకటి ఉందన్న విషయమే జనం మర్చిపోయేంతగా మేజిక్ చేసి పారేశారు. డాన్సులు పాటలు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఈ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ ముందు చాలా లోపాలు కొట్టుకుపోయాయి

2. తమన్ ది వన్ అండ్ ఓన్లీ

ఒకవేళ అఖండకు తమన్ కాకుండా ఇంకెవరు సంగీతం అందించినా ఈ స్థాయిలో అవుట్ ఫుట్ ఉండేది కాదన్నది అతిశయోక్తి అనిపించినా సరే నిజమిదే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన తమన్ అఘోరా ఎపిసోడ్స్ కి ప్రాణం పెట్టాడు. బిజిఎమ్ ని మ్యూట్ చేసుకుని విజువల్స్ ని ఊహించుకుంటే చాలు అసలు విషయం అర్థమైపోతుంది. మొదటిసారి తమ హీరోతో జట్టు కట్టి ఇలాంటి ఎవర్ గ్రీన్ స్కోర్ ఇచ్చినందుకు బాలయ్య ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు

3. హిందూ ధర్మం

శివుడి ప్రాశస్త్యం, హిందూ ధర్మంలోని సూక్ష్మ అర్థాలు ఇందులో సందర్భానికి తగ్గట్టు దర్శకుడు బోయపాటి శీను వాడుకున్న తీరు అభినందనీయం. పూర్ణ-శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఇబ్బందికరమైన సన్నివేశాలను సైతం ఈ కారణం వల్లే జనం క్షమించేశారు. గుళ్ల ప్రాముఖ్యత గురించి సీన్లో బాలయ్య డైలాగులకు, రచయిత ఎం రత్నం మెరుపులకు విజిల్స్ గట్టిగానే పడుతున్నాయి. ఇవన్నీ సెకండ్ హాఫ్ లోనే ఉండటం గమనార్హం. రిపీట్ రన్స్ కి ఇదే ఊతంగా నిలుస్తోంది

4. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం

హీరోయిజంని ఎంత ఎలివేట్ చేసినా సరే దానికి తగ్గ కెమెరా వర్క్ కుదిరినప్పుడే దాని తాలూకు ఎఫెక్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రామ్ ప్రసాద్ ఈ విషయంలో ఇచ్చిన పనితనం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా స్లో మోషన్ షాట్స్ ని కట్ చేసిన తీరు, క్లైమాక్స్ లో అఖండ విలన్లను అంతమొదించే క్రమంలో చూపించే విజువల్స్ అన్నీ చాలా బాగా కుదిరాయి. బాలయ్య వయసుని కవర్ చేస్తూ అందంగా చూపించడంలోనూ ఈయన నేర్పరితనం ఆకట్టుకుంది

5. బోయపాటి ఆలోచనలు

ఇద్దరు కవలలు పుట్టగానే విడిపోయి వేర్వేరుగా పెరగడం అనేది అపూర్వ సహోదరులు నుంచి ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ బోయపాటి దాన్ని ఫాలో అవుతూనే ఒక క్యారెక్టర్ ని అఘోరాగా మలచాలనే సాహసోపేతమైన ఆలోచన దగ్గర మొదటి సక్సెస్ అందుకున్నారు. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు మాస్ కి బాగా ఎక్కేసింది. చాలా సీన్లలో పరిధులు దాటినా కూడా ఆఖరికి పబ్లిక్ కి నచ్చిందా లేదా అనేదే కొలమానంగా నిలుస్తుంది కనక బోయపాటి ఈజీగా హ్యాట్రిక్ కొట్టేశారు

6. నిర్మాణ విలువలు

అఖండ మేకింగ్ లో రాజీ లేదు. నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి బడ్జెట్ గురించి ఆందోళన చెందారన్న వార్తలు మీడియాలో గట్టిగానే తిరిగాయి కానీ ఇప్పుడవన్నీ కలెక్షన్ల సునామిలో కొట్టుకుపోయినట్టే. బోయపాటి శీను ఖర్చుని పెంచేస్తారన్న కామెంట్ ఎప్పటి నుంచో ఉంది. అయినా రవీంద్రారెడ్డి వెనుకాడలేదు. విడుదల సమయంలో టికెట్ రేట్ల ఇష్యూ వల్ల థియేట్రికల్ బిజినెస్ మొత్తం కొంత తగ్గినా సరే రిలీజ్ కు ధైర్యం చేయడం ఇప్పుడు ఊహకు అందని ఫలితాన్ని ఇచ్చింది

Also Read : Manchu Vishnu : మనం రాళ్లేసినా, వాళ్ళు రాళ్లేసినా మనకే నష్టం.. ఆచి తూచి మాట్లాడదాం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి