iDreamPost

హర్యానా అల్లర్లలో ఆరుగురు మృతి.. ఢిల్లీలోనూ హై అలర్ట్!

హర్యానా అల్లర్లలో ఆరుగురు మృతి.. ఢిల్లీలోనూ హై అలర్ట్!

హర్యానాలో అల్లర్లు ఇంకా చల్లారలేదు. రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు అటు ఢిల్లీలో కూడా హైఅలర్ట్ విధించారు. హర్యానా నూహ్ లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఊరేగింపు అల్లర్లకు దారి తీసింది. ఈ ఊరేగింపు సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్రమొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.

ఈ అల్లర్లు, ఘర్షణ కారణంగా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అధికారిక ప్రకటన జారీ చేశారు. మృతుల్లో ఓ ఇమామ్, ఇద్దరు హోంగార్డులు, ముగ్గురు పౌరులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనల్లో పోలీసులు 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అల్లర్లు, ఘర్షణలతో సంబంధం ఉన్న 116 మందికని అరెస్టు కూడా చేశారు. మరోవైపు గుడ్ గావ్ లో కూడా అల్లర్లు పెళ్లుబికాయి. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్సీఆర్ ప్రాంతంలో పోలీసులను మోహరించింది. ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.

ఈ ఆందోళనలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అల్లర్లకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు పిలుపునిచ్చింది. మేవట్ లో ఆందోళనలకు వీహెచ్పీ పిలుపునివ్వడం ఇప్పుడు మరింతి ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా బజ్ రంగ్ దళ్ వాళ్లు మహా పంచాయత్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి స్పందించారు. కుట్రపూరితంగానే ఈ హింసను రెచ్చగొట్టారంటూ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ.57 లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు చరాస్తి నష్టంలో గరిష్టంగా రూ.5 లక్షలకు 80 శాతం మేర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఆగస్టు 16వ తారీకు కల్లా నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రజల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం భరోసానిచ్చారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయని.. అక్కడ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

హర్యానాలో కూడా ప్రస్తుతం పరిస్థితి సాధారణస్థితికి చేరుకున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు. అందరూ సోదరభావంతో మెలగాలంటూ కోరారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు స్పందించింది. హర్యానా అల్లర్లపై దాఖలైన పిటీషన్ పై బుధవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణను ఆగస్టు 4వ తారీఖుకు వాయిదా వేసింది. ఈ అల్లర్లకు సంబంధించి అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రికార్డైన దృశ్యాలను భద్రపరచాలన్నారు. అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి