iDreamPost

ఏప్రిల్ 28 – 4 చరిత్రలకు సాక్ష్యం – Nostalgia

ఏప్రిల్ 28 –  4 చరిత్రలకు సాక్ష్యం –  Nostalgia

కొన్ని డేట్లను సినిమా పరిశ్రమలో మేజిక్ గా భావిస్తారు. అదేంటో ఆ రోజు విడుదలైన చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అంతే కాదు వాటి హీరో హీరోయిన్లకు దర్శకులకు కెరీర్ పరంగానూ ఎంతో డిమాండ్ ని సృష్టించిపెడతాయి. అలాంటిదే ఏప్రిల్ 28. ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా. 1977లో సరిగ్గా ఇదే రోజున ఎన్టీఆర్ అడవిరాముడు రిలీజై వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో నిరూపించింది. అప్పటివరకు ఏ తెలుగు సినిమాకు సాధ్యం కానీ రీతిలో 4 కోట్ల వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది.

దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారిని అమాంతం ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత దీనిది. ఎన్టీఆర్ కెరీర్ ని ఇంకో పదేళ్లు పెంచేసి కమర్షియల్ సినిమాకు గ్రామర్ గా నిలిచింది. ఇప్పటికీ 4 కేంద్రాల్లో ఏడాది ఆడిన అడవిరాముడు రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాలేదు. 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కమెడియన్ ఆలీని హీరో గా పెట్టి తీసిన యమలీల కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. అద్భుతమైన పాటలు, ఆరోగ్యకరమైన హాస్యం వెరసి స్టార్ హీరోల పోటీ విపరీతంగా ఉన్న టైంలోనూ ఇది భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక 2006లో పోకిరి గురించి చెప్పేదేముంది. అబ్బురపడే రీతిలో బాక్స్ ఆఫీస్ వద్ద పూరి జగన్నాధ్ తో కలిసి మహేష్ బాబు చేసిన మాస్ మేజిక్ ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది. మాఫియా కథను అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అనే పాయింట్ ని జోడించి పూరి ఇచ్చిన థ్రిల్ కి 175 రోజుల పాటు వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది.

2017లో రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి కూడా ఏప్రిల్ 28నే వచ్చింది. తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ లో గర్వంగా నిలబెట్టి కలలో కూడా ఊహించని వేల కోట్ల వసూళ్లను అవలీలగా సాధించి బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే రేంజ్ లో రాజమౌళి ఆవిష్కరించిన ఈ దృశ్యకావ్యం వల్లే ప్రభాస్ దేశదేశాల్లోనూ గొప్ప గుర్తింపు సాధించాడు. ఇలా నాలుగు వేటికవే ప్రత్యేకత కలిగిన చిత్రాలు కావడం గమనార్హం. యమలీల మిగిలిన మూడింటితో పోల్చే స్థాయి కాదు కానీ సైడ్ క్యారెక్టర్స్ లో నవ్వించే ఆలీకి ఏకంగా యాభై చిత్రాలకు పైగా హీరో ఆఫర్స్ వచ్చేలా చేసిందంటే చిన్న విషయం కాదుగా. అలా అని ఈ డేట్ లో అసలు ఫ్లాప్స్ రాలేదని కాదు కానీ ఇలా నాలుగు గొప్ప సినిమాలు నిలిచిపోవడం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి