iDreamPost

Gharana Mogudu 30 వసంతాల ఘరానా సంచలనం

Gharana Mogudu 30 వసంతాల ఘరానా సంచలనం

అసలు మాస్ సినిమా అంటే ఎలా ఉండాలి ?
దానికి కొలమానం ఏమిటి ?
ఏవి ఏ పాళ్ళలో ఉంటే జనం ఆదరిస్తారు ?
ఒక పెద్ద స్టార్ హీరోతో కమర్షియల్ ప్యాకేజీని ఎలా అందించాలి ?

ఇలాంటి ప్రశ్నలు ఎదుగుతున్న దర్శకులకే కాదు స్టార్ డైరెక్టర్లకు సైతం నిత్యం సవాల్ విసురుతూ ఉంటాయి. ఎందుకంటే వీటికి సమాధానం దొరకడం అంత సులభం కాదు. మాస్ నాడిని పట్టుకుని వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని అంశాలు జోడించి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించుకోవడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. అందుకే రాఘవేంద్రరావు ఎన్టీఆర్ లాంటి దిగ్గజంతో అడవిరాముడుతో ఒక చరిత్రకు శ్రీకారం చుడితే, మెగాస్టార్ చిరంజీవితో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆ చిత్రం పేరే ‘ఘరానా మొగుడు’

1991లో విజయశాంతి తమిళ్ లో సూపర్ స్టార్ రజనికాంత్ తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు. ఖుష్బూ సెకండ్ హీరొయిన్. ఇళయరాజా సంగీతం. నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. పి వాసు దర్శకుడు. సెట్స్ లో ఉండగానే సబ్జెక్టులోని దమ్ము గుర్తించిన ఆవిడ వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి చెప్పి తెలుగు రీమేక్ హక్కులకు దేవివరప్రసాద్ గారికి ఇప్పించారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు విజయశాంతి బిజీగా ఉండటం వల్ల నగ్మాకు జాక్ పాట్ తగిలింది. రెండో కథానాయికగా వాణి విశ్వనాథ్ ను ఫిక్స్ చేశారు. కీరవాణి సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు.

దర్శకేంద్రుల మాయాజాలం

ఘరానా మొగుడుకు ప్రాణం రాజు, ఉమాదేవి పాత్రలే. చెప్పుకోవడానికి ఇద్దరు విలన్లు ఉన్నప్పటికీ కథ లీడ్ పెయిర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. రాజు ఉమాదేవి మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ళ వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయడం పరుచూరి వారి తెలివికి మచ్చుతునక. డబ్బున్న మదం నిలువెల్లా నిండిన ఉమాదేవి పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన తీరు, రాజుకి తనకు మధ్య బాండింగ్ ని ఒక క్రమపద్ధతిలో పేర్చిన తీరు మాస్ కి బాగా ఎక్కేసింది. ఇలాంటి కూర్పు ఘరానా మొగుడులో ఆద్యంతం తారసపడుతుంది.చిరంజీవిలోనే ఎనర్జీని పూర్తిస్థాయిలో వాడుకున్న చిత్రాల్లో ఘరానా మొగుడుది చాలా ప్రత్యేకమైన స్థానం.

ఎవరికెవరు తీసిపోరు

ఇది ఒకరకంగా వన్ మ్యాన్ షో అయినప్పటికీ చిరుకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి. చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతిదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు ఇచ్చేసరికి  అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. డాన్సుల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణేలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో అది కిక్ ఇచ్చిందో. శరీరాన్ని స్ప్రింగ్ లా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్ లో నృత్యంతో మైమరిపింపజేయడం ఆయనకే చెల్లింది.

మూడో తెలుగు సినిమానే అయినప్పటికీ ఈ సినిమాలో నగ్మా చూపించిన పరిణితి తనను ఓవర్ నైట్ స్టార్ ని చేసిందనడంలో అబద్దం లేదు. చిరు లాంటి శిఖరం ముందు రాధ, రాధిక, విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ఫైర్ ని తట్టుకుని ధీటుగా నటించేవారు. కాని నగ్మా ఇంత తక్కువ టైంలో అది అందుకోవడంతో ఇంటి బయట నిర్మాతలు క్యు కట్టేలా చేసింది.ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. దెబ్బకు కీరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

1992 ఏప్రిల్ 9ఏప్రిల్ ….

గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మాసివ్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకుని ఘరానా మొగుడు భారీ ఎత్తున విడుదలైంది. కర్ణాటకలో బెంగుళూరు, బళ్లారిలతో మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో బాపట్ల హైదరాబాద్ దాకా రికార్డుల ఊచకోత మొదలైంది. ఎక్కడ చూసినా కిక్కిరిపోతున్న రద్దీతో పోలీస్ బందోబస్తుతో టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. బ్లాకు టికెట్ రాయుళ్ళ జేబులు గ్యాప్ లేకుండా నిండుతున్నాయి. చూసిన ఫ్యాన్స్ పదే పదే చూస్తూ సామాన్య ప్రేక్షకులు ఘరానా మొగుడు చూడటాన్ని ఆలస్యం చేస్తున్నారు. 

రికార్డుల ఊచకోత

ఘరానా మొగుడు 105 ప్రింట్లతో రిలీజ్ చేస్తే 62 కేంద్రాల్లో 50 రోజులు, 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నైజామ్ లో 50 థియేటర్లలో రిలీజ్ చేసిన మొదటి  సినిమా ఇదే. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో రోజూ 4 ఆటలతో 175 రోజులు ఆడింది. గుంటూరులో అనిల్ కపూర్, దాసరి నారాయణరావు ముఖ్య అతిథులుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 4 లక్షల అభిమానుల సమక్షంలో కళ్ళు చెదిరే రీతిలో శతదినోత్సవ వేడుకలు చేశారు. మలయాళంలో హే హీరో పేరుతో  లక్ష రూపాయలకు డబ్బింగ్ హక్కులు అమ్మితే ఫుల్ రన్ లో కోటి రూపాయలు వసూలు చేసింది. 4 సెంటర్లలో హండ్రెడ్ డేస్ కూడా ఆడింది.ఘరానా మొగుడు రేంజ్ ఏంటో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి