iDreamPost

ముగిసిన అచ్చెం నాయుడు ఏసీబీ కస్టడీ.. నెక్స్‌ ఏంటి..?

ముగిసిన అచ్చెం నాయుడు ఏసీబీ కస్టడీ.. నెక్స్‌ ఏంటి..?

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు ఏసీబీ కస్టడీ ముగిసింది. ఏసీబీ పిటిషన్‌ మేరకు అచ్చెం నాయుడును మూడు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. గురువారం మొదలైన ఏసీబీ కస్టడీ నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు అచ్చెం నాయుడును గుంటూరు జీజీహెచ్‌లోనే విచారించారు.

అచ్చెం నాయుడు న్యాయవాదులు, ఆయనకు చికిత్స చేసిన వైద్యుల సమక్షంలోనే తొలిరోజు మూడు, గంటలు, రెండో రోజు ఐదు గంటలు, చివరి రోజైన శనివారం రెండున్నరగంటల మేర ఏసీబీ అధికారులు అచ్చెం నాయుడును విచారించారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ఈఎస్‌ఐ స్కాంపై పలు ప్రశ్నలు సంధించారు. స్కాంతో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో తాను మంత్రిగా లేనని, సిఫార్సులు మాత్రమే చేశానని.. అచ్చెం నాయుడు ఏసీబీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

ఈఎస్‌ఐ స్కాంలో పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఒకేరోజు అచ్చెం నాయుడుతో సహా ఈఎస్‌ఐ మాజీ, ప్రస్తుత« అధికారులు మొత్తం ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉంచారు. అయితే అచ్చెం నాయుడుకు అరెస్ట్‌కు ముందే ఫైల్స్‌ సర్జరీ చేయడంతో రక్తస్రావం అవుతోందని రిమాండ్‌ విధించిన తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి అచ్చెం నాయుడు అక్కడే ఉంటున్నారు. మరో మారి కూడా అచ్చెం నాయుడుకు శస్త్ర చికిత్స చేశారని వార్తలొచ్చాయి. ఇది జరిగి కొద్ది రోజులు గడుస్తోంది.

ప్రస్తుతం ఏసీబీ కస్టడీ కూడా ముగియడంతో తిరిగి ఆయన విషయం కోర్టు ముందుకు వెళ్లనుంది. అయితే కోర్టు తిరిగి ఆయన్ను ఆస్పత్రిలోనే ఉంచమని చెబుతుందా..? జైలుకు తరలించమని ఆదేశిస్తుందా..? వేచి చూడాలి. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అచ్చెం నాయుడును ఆస్పత్రిలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కోర్టు వైద్యుల నుంచి నివేదిక తీసుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి