iDreamPost

టీఎంసీ నేత హత్యకు ప్రతీకారం.. బెంగాల్లో 10 మంది సజీవ దహనం

టీఎంసీ నేత హత్యకు ప్రతీకారం.. బెంగాల్లో 10 మంది సజీవ దహనం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్ భూమ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత హత్యకు ప్రతీకారంగా అతని వర్గీయులు తీవ్ర హింస, గృహదాహనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పదిమంది సజీవ దహనమయ్యారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది. అగ్నిమాపక దళాలు, పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

హత్యకు ప్రతీకారంగా దాడులు

బీర్ భూమ్ జిల్లాలోని రాంపూర్హాత్ ప్రాంతంలోని బాగుటి పంచాయతీ బోర్డు సభ్యుడు, టీఎంసీ నేత అయిన బాదు షేక్ సోమవారం రాత్రి 60వ నంబర్ జాతీయ రహదారిలో ఒక షాప్ వద్ద ఉండగా కొందరు దుండగులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన షేక్ ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను మృతి చెందాడు. దాంతో కోపోద్రిక్తులైన అతని వర్గీయులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడికి దిగారు. వారి ఇళ్లకు బయటనుంచి గడియ పెట్టి నిప్పంటించారు. 12 ఇళ్లను తగులబెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో ఇళ్లలో ఉన్నవారు మంటలో కాలి మరణించారు. మొత్తం పదిమంది మరణించినట్లు అగ్నిమాపక దళ అధికారులు వెల్లడించారు. ఒకే ఇంట్లో ఏడు మృతదేహాలను గుర్తించినట్లు వారు తెలిపారు. మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఈ దహనకాండకు కారకులు, మృతులను ఇంకా గుర్తించలేదు. బాదు షేక్ హత్యకు సంబంధించి మాత్రం ఒక నిందితుడిని అరెస్టు చేశారు.

రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్

రాష్ట్రంలో గత వామపక్ష హయాంలోని అకృత్యాలు, అరాచకాలు పునరావృతం అవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మారణకాండకు టీఎంసీలోని అంతర్గత గొడవలే కారణమని సీపీఎం ఆరోపించగా.. అధికార టీఎంసీ మాత్రం అసలు దాడులే జరగలేదని పేర్కొంది. ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మండల్ వ్యాఖ్యానించారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెచ్చరిల్లిన హింసాకాండలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 మంది హతమయ్యారు. ఆ తర్వాత అంతపెద్ద హింసాత్మక ఘటన ఇదేనని అంటున్నారు. దహణకాండ నేపథ్యంలో రాంపూర్హాత్ ఎస్డీపీవోను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఏడీజీ గ్యాన్వంత్ సింగ్, వెస్ట్రన్ జోన్ ఏడీజీ సంజయ్ సింగ్, సీఐడీ డీఐజీ మీరజ్ ఖలీద్ లను సభ్యులుగా నియమించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి