iDreamPost

మనోహర్‌కు ఆశ్చర్యమేస్తోందట..!

మనోహర్‌కు ఆశ్చర్యమేస్తోందట..!

జనసేన నేత, ఆ పార్టీ పొలిటికల్‌ అఫైర్‌ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. జనసేన పార్టీ నడుపుతోంది పవన్‌ కళ్యాణ్‌ నటించే సినిమాల కోసం అన్నట్లుగా ఉంది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, అవసరమైనప్పుడు లేదా సమయం దొరికినప్పుడు కార్యక్రమాలు చేస్తూ.. సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయ పార్టీ ఉపయోగించుకోవాలన్నట్లుగా ఉంది జనసేన నేతల తీరు. భీమ్లా నాయక్‌ సినిమా విడుదలైన సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి ఈ అనుమానాలు కలగకపోవు.

భీమ్లా నాయక్‌ సినిమా విడుదల రోజున వైసీపీ సర్కార్‌ వ్యవహరించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని నాదెండ్ల మనోహర్‌ చెప్పుకొచ్చారు. ఇంతకూ మనోహర్‌ అంతగా ఆశ్చర్యం ఎందుకు పోయారంటే.. సినిమా విడుదలైన నిన్న శుక్రవారం సినిమా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులు ఉన్నారట. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు థియేటర్ల వద్ద కాపలా కాశారంటూ నాదెండ్ల చెప్పకొచ్చారు. ఈ మాటలు విన్న తర్వాత అర్థమైంది ఏమంటే.. అభిమానుల ఉత్సుకతను సొమ్ము చేసుకునే అవకాశం తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు లేకుండా చేశారనేదే నాదెండ్ల బాధ. ప్రాంతాలను బట్టీ 100, 150, 200 రూపాయల చొప్పన విక్రయించాల్సిన సినిమా టిక్కెట్లు.. అసలు సినిమా ఎలా ఉందో తెలిసే లోపు మొదటి రోజునే టిక్కెట్‌ వేయి, రెండు వేల రూపాయల చొప్పన అమ్మేసి సొమ్ము చేసుకునే అవకాశం ‘భీమ్లా నాయక్‌’కు లేకుండా పోయింది. గత ఏడాది ‘వకీల్‌ సాబ్‌’కు కూడా ఈ అవకాశం దక్కలేదు.

అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌తో సహా ఇతర అగ్ర నటులు సినిమా విడుదల రోజు నుంచి వారం రోజుల వరకూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టిక్కెట్లు విక్రయించిన దాఖలాలు లేవు. దొరికిన వరకూ ప్రేక్షకుల నుంచి దండుకునే అవకాశం ఉండేది. వంద రూపాయలు విక్రయించాల్సిన టిక్కెట్‌ ఆరు వందలు, వేయి రూపాయలు పలికినా.. అదో గొప్ప వార్త మాదిరిగా మీడియా కూడా ప్రచారం చేసేది. ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే వాదన మరుగునపడిపోయింది.

ఈ తరహా దందాకు అలవాటుపడిన వారు.. ఒక్కసారిగా ఒకటికి పది రూపాయలు వచ్చే అవకాశం పోవడంతో గిలగిలాడుతున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించడం వల్ల ప్రజలు, ప్రేక్షకులు సంతోషంగానే ఉన్నారు. కానీ బ్లాక్‌ను నియంత్రించడమనే వ్యవహారమే నాదెండ్ల మనోహర్‌కు ఆశ్చర్యమేస్తోంది. వంద రూపాయల టిక్కెట్‌ వంద రూపాయలకే విక్రయించే పరిస్థితి ఉండడంతోనే బహుసా జనసేన నేతకు ఆశ్చర్యమేస్తోందేమో..!?

స్పీకర్‌గా కూడా పని చేసిన అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్‌కు రెవెన్యూ అధికారుల విధులు, బాధ్యతలు తెలిదేమో. సినిమా థియేటర్లకు సంబంధించిన అనుమతులు, నిర్ణయించిన ధరలకే టిక్కెట్లు అమ్మేలా చూడాల్సిన బాధ్యత, బ్లాక్‌టిక్కెట్లు విక్రయిస్తుంటే అరికట్టాలిన విధి.. రెవెన్యూ అధికారులదే. సినిమాలు చూసేది ప్రజలే. వారికి వంద రూపాయలకు దక్కాల్సిన టిక్కెట్‌కు వేయి రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. దాన్ని ప్రజా సమస్య కాకుండా మరేమంటారో నాదెండ్లే చెప్పాలి.

కేవలం పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకే ఈ పరిస్థితి ఉంటే.. రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇటీవల విడుదలైన బాలయ్య సినిమా అఖండ, నాగార్జున నటించిన సినిమా బంగార్రాజు సహా అన్ని సినిమాలకు ఎలాంటి విధానాన్ని అవలంభించారో.. భీమ్లా నాయక్‌ సినిమాకు కూడా అదే విధానాన్ని వర్తింపజేశారు. ఇలా కాదు మా నాయకుడుకు రాజకీయ పార్టీ ఉంది కాబట్టి.. అందరికి వర్తించే నిబంధనలు వర్తించవని నాదెండ్ల అంటారేమో. సోము వీర్రాజు చెప్పుకుంటున్నట్లుగా.. బీజేపీ–జనసేన ప్రభుత్వం వస్తే… కొంత మంది నటుల సినిమాలకు ప్రత్యేకమైన విధానం అవలంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి