iDreamPost

బురద పాము.. అయ్యన్న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి..?

బురద పాము.. అయ్యన్న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి..?

పుట్టలో బురదపాములు అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. మూడేళ్ళుగా పుట్టలో దాక్కున్న పాములు అని కూడా అంటున్నారు. ఇంతకీ ఎక్కడ పుట్ట, ఏమా బురద పాముల కథ . ఇదే ఇపుడు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకించి టీడీపీలో చర్చనీయాంశంగా ఉంది.

ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయాలను చూస్తే మరో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. ఆయన మూడేళ్ళ తరువాతనే ఇపుడు యాక్టివ్ అయ్యారు. ఇక ఆయన గతంలో అనేక పార్టీలు మారారు. ఈ మధ్య దాకా ఆయన వైసీపీలోకి వెళ్తారు జనసేనలోకి వస్తారు బీజేపీలోకి వెళ్తారు అంటూ ప్రచారం అయితే సాగింది.

కానీ గంటా మాత్రం తాను టీడీపీలోనే అంటూ లేటెస్ట్ గా సంకేతాలు పంపుతున్నారు. ఆయన టీడీపీ హై కమాండ్ తో కూడా బాగా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక విశాఖలో లోకేష్ పుట్టినరోజును ఈసారి గంటా ఆధ్వర్యాన జరిపించారు. తాజాగా ఆయన తాను గెలిచిన ఉత్తర నియోజకవర్గం వెళ్ళి మరీ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

మొత్తానికి చూస్తే గంటా మార్క్ పాలిటిక్స్ టీడీపీ లో స్టార్ట్ చేశారు. దాంతోనే ఆయన ప్రత్యర్ధిగా ఉన్న అయ్యన్న ఇలా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ ఇద్దరిమధ్య అసలు పొసగదు అని అంతా అంటారు. అప్పట్లో అంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడే విశాఖ సిటీలో జరిగిన భూ దందాల మీద గంటా ప్రమేయం మీద విచారణ జరిపించాలని అయ్యన్న డిమాండ్ చేశారు అంటేనే ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ఏ లెవెల్ లో మండుతుంది అన్నది అర్ధమవుతోంది. మొత్తానికి గంటా వర్సెస్ అయ్యన్న రాజకీయం టీడీపీలో మళ్ళీ మొదలైంది. చంద్రబాబు ఈ ఇద్దరినీ ఎలా దారికి తెస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి