iDreamPost

ప్రిన్స్ రిపోర్ట్

ప్రిన్స్ రిపోర్ట్

తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ కు తెలుగులో మార్కెట్ తక్కువ. చాన్నాళ్ల క్రితం రెమో, సీమరాజా లాంటి వాటితో ఓ మోస్తరుగా మెప్పించాడు కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేం దక్కలేదు. వరుణ్ డాక్టర్ సూపర్ హిట్ కావడం, కాలేజీ డాన్ కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ఇతన్ని టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టేలా చేశాయి. అందుకే దర్శకుడు అనుదీప్ చెప్పిన ప్రిన్స్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏషియన్, సురేష్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావడంతో బడ్జెట్ పరంగానూ దీన్ని పెద్ద స్కేల్ లో తీశారు. జాతిరత్నాలుతో ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ దర్శకుడు కావడం ప్రిన్స్ మీద అంచనాలు పెంచాయి. ఇంతకీ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

అనగనగా దేవరకోట అనే చిన్న ఊరు. అక్కడివారందరికి మంచి చెడ్డ చెప్పే పెద్ద మనిషి విశ్వనాథం(సత్యరాజ్). ఆయన కొడుకు సూర్య (శివ కార్తికేయన్) లోకల్ స్కూల్లోనే సోషల్ టీచర్ గా పని చేస్తుంటాడు. ఇంగ్లీష్ పాఠాలు చెప్పడానికి వచ్చిన కొత్త పంతులమ్మ జెస్సికా (మారియా ర్యాబోపష్కా)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే వీళ్ళ వ్యవహారం తండ్రికి నచ్చదు. ఆయనతో పాటు మిత్రులు బందువులు సైతం ఈ లవ్ స్టోరీకి రెడ్ సిగ్నల్ ఇస్తారు. ఈలోగా జెస్సికా నాన్నకు సంబంధించిన ఓ భూవివాదం తెరపైకొస్తుంది. ఈ సమస్యతో పాటు తన ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లే సవాల్ సూర్య ముందుంటుంది. అందులో ఎలా గెలిచాడనేదే ప్రిన్స్ అసలు స్టోరీ

శివ కార్తికేయన్, సత్యరాజ్ లు తమ పాత్రలను చాలా అలవోకగా చేసుకుంటూ పోయారు. పెద్దగా వైవిధ్యం డిమాండ్ చేసేది కాకపోవడంతో ఇద్దరూ పోటీపడి నటించేశారు. ఎటొచ్చి హీరోయిన్ మారియానే ఆశించిన పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయింది. దర్శకుడు అనుదీప్ ఈసారి కథకన్నా ఎక్కువ వన్ లైన్ పంచెస్ తో సాగే కామెడీనే నమ్ముకున్నాడు. దీంతో లాజిక్స్ కాస్తా సిల్లీగా మారిపోయాయి. ఏదో నవ్వించడంతో ఆగకుండా సందేశాలు ఇప్పించడం, ఎమోషన్ల ల్యాగ్ వగైరా ఓపికకు కాసింత గట్టి పరీక్షనే పెడతాయి. తమన్ సంగీతం సోసోనే. హాస్యం ఎంత అవుట్ డేటెడ్ గా ఉన్న పర్లేదనుకునేవారికి ప్రిన్స్ ఓ మాదిరిగా టైంపాస్ చేయిస్తుంది కానీ ఫైనల్ గా చెప్పాలంటే ప్రిన్స్ యావరేజ్ దగ్గరే తడబడ్డాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి