iDreamPost

ఆహార్యం, ఆహారంపై రాజకీయం..!

ఆహార్యం, ఆహారంపై రాజకీయం..!

దేశంలో మునుపెన్నడూలేని, భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో రాజకీయ స్వరూపం మారుతోంది. ప్రజా సమస్యలు, విధానపరమైన నిర్ణయాల చుట్టూ తిరిగే రాజకీయం.. ఇప్పుడు ప్రజల ఆహార్యం, ఆహారం చుట్టూ కూడా తిరుగుతోంది. ఆహార్యం, ఆహారంపై వివాదాలు ఏర్పడుతున్నాయి.విధానపరమైన నిర్ణయాలు
వెలువడుతున్నాయి. మొన్న కర్ణాటకలో విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధం విధించగా.. పెద్ద వివాదమే నెలకొంది. ఆ తర్వాత కర్ణాటకలో హలాల్‌ మాంసం విక్రయాలపై వివాదం మొదలైంది. తాజాగా ఇలాంటి వివాదమే దేశ రాజధాని ఢిల్లీలోనూ మొదలైంది. నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధించే ఆలోచనను బీజేపీ పాలక మండలి చేస్తుండడం వివాదానికి కారణమవుతోంది.

మేయర్‌ లేఖ..

నవరాత్రుల సందర్భంగా 99 శాతం ప్రజలు ఉల్లి, వెల్లుల్లి తినరని చెప్పిన దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ మేయర్‌ ముఖేష్‌ సూర్యన్‌ త్వరలోనే మాంసం దుకాణాల మూసివేతపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. నవరాత్రి సందర్భంగా రోజు వారీగా దుర్గామాత పూజలు చేసేందుకు వెళ్లే వారు మాంసం దుకాణాలు దాటి వెళ్లాలన్నా.. ఆ వాసన భరించాలన్నా ఇబ్బందిగా ఉంటుందని, భక్తుల నమ్మకాలు దెబ్బతింటాయని, అందుకే నవరాత్రుల కాలంలో మాంసం దుకాణాలు మూసివేసే ఆలోచన చేస్తున్నట్లు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. దుర్గామాత భక్తులు 9 రోజుల పాటు కేవలం శాఖాహారంతోనే ఉపవాస దీక్షలు చేస్తారని, మాంసం, మద్యం, కొన్ని రకాల సుగంద ద్రవ్యాలు ముట్టుకోరని మేయర్‌ ముఖేష్‌ తాను తీసుకోబోయే నిర్ణయానికి కారణాలు పేర్కొన్నారు.

ప్రధానిపై ఓవైసీ విమర్శలు..

దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ తీసుకోబోయే నిర్ణయంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దిన్‌ ఓవైసీ స్పందించారు. బీజేపీ పాలక మండలి తీరును నిరసిస్తూ.. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కేవలం పారిశ్రామికవేత్తలకే పరిమితం చేయాలని మోడీ భావిస్తున్నారని విమర్శించారు. సైద్ధాంతికపరమైన సహచరుల కోసమే నవరాత్రుల సమయంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాంసం ఏమీ అపవిత్రం కాదని, ఉల్లి, వెల్లుల్లి తరహాలోనే అది కూడా ఒక ఆహారమని ఓవైసీ అభివర్ణించారు. 99 శాతం కాదు, 100 శాతం మంది ప్రజలకు మాంసం కొనాలా..? వద్దా..? అనే చాయిస్‌ ఉంటుందని, వద్దునుకుంటే కొనబోరని అసదుద్దిన్‌ మాట్లాడడంతో ఈ వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీస్తోంది.

బీజేపీ తీరుపై రాజకీయ విమర్శలు..

బీజేపీ తీరుపై రాజకీయంగా విమర్శలు చెలరేగుతున్నాయి. మతపరమైన అంశాలను రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో డిల్లీ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లు ఉండగా.. వాటన్నింటినీ ఏకంచేసి ఢిల్లీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర పడింది. ప్రస్తుతం ఢిల్లీలోని మూడు కార్పొరేషన్లలో బీజేపీనే అధికారంలో ఉంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకే ప్రజల మనోభావాలతో రాజకీయాలు మొదలుపెట్టిందనే విమర్శలను బీజేపీ ఎదుర్కొంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి