iDreamPost

ఏజెంట్ ఎంట్రీతో వేడెక్కిన పండగ

  • Published - 04:45 PM, Mon - 24 October 22
ఏజెంట్ ఎంట్రీతో వేడెక్కిన పండగ

2023 సంక్రాంతి పండగ మాములు వేడెక్కడం లేదు. ఇప్పటికే ఫిక్స్ అయిన నాలుగు రిలీజులకే థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో డిస్ట్రిబ్యూటర్లకు అంతు చిక్కడం లేదు. ఓవర్సీస్ లో ఆల్రెడీ స్క్రీన్లను ముందస్తుగా లాక్ చేసుకోవడం మొదలైపోయిందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత టఫ్ సిచువేషన్ లో అఖిల్ ఏజెంట్ కూడా పొంగల్ కే వస్తుందంటూ నిర్మాతలు వదిలిన కొత్త పోస్టర్ ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆది పురుష్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు మధ్య ఏ ధైర్యంతో దించుతున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో మొదలైపోయాయి. కాకపోతే నిర్మాత అనిల్ సుంకర క్యాలికులేషన్లు వేరే ఉన్నాయని తెలిసింది.

ప్రస్తుతానికి పోటీ పైకి ఇలా కనిపిస్తున్నప్పటికీ ముందు లాక్ అయిన వాటిలో ఒకటో రెండో తప్పుకోవచ్చనే ప్రచారం నిన్నటి నుంచి ఊపందుకుంది. ఆది పురుష్ ని జనవరి 6 లేదా 8 ఒకవేళ అదీ సాధ్యపడకపోతే చివరి వారంకి షిఫ్ట్ చేసే దిశగా ఒక ప్రతిపాదన ఉందట. అయితే దర్శకుడు ఓం రౌత్ మాత్రం దీని పట్ల అంత సుముఖంగా లేడని ముంబై టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న విజయ్ వారసుడు తమిళనాడులో తప్ప బయట అంత భీభత్సమైన బజ్ లేదు. వీటి మధ్యలో రిస్క్ చేయడం చూస్తే బయట రాష్ట్రాల కలెక్షన్ల మీద పెద్ద ఆశలు పెట్టుకోలేదేమో. చిరంజీవి బాలయ్యలకు సైతం తెలుగు వెర్షన్ ఒకటే మెయిన్ టార్గెట్ కాబట్టి ఇబ్బంది లేదు.

ఎటొచ్చి ఏజెంటే ప్యాన్ ఇండియా మూవీ. అన్ని ప్రధాన భాషల్లో వస్తుంది. బడ్జెట్ కూడా తడిసి మోపెడయ్యింది. సైరా నరసింహారెడ్డి తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి దీని కోసం చాలా సమయం ఖర్చు పెట్టారు. మూడేళ్లు ఈ ఒక్క ప్రాజెక్టు మీదే వర్క్ చేయాల్సి వచ్చింది. కథ విపరీతంగా నచ్చితే కానీ ఇతర బాషల సినిమాలు ఒప్పుకోని మమ్ముట్టి ఏజెంట్ లో నటించడం కేరళ మార్కెట్ కోణంలో అతి పెద్ద ప్లస్. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పుడు కంటెంట్ బలంగా ఉంటే ఎప్పుడొచ్చినా బ్లాక్ బస్టర్ దక్కుతుంది. అంతే తప్ప సంక్రాంతికి వస్తేనే సేఫ్ అవుతుందనుకోవడం కరెక్ట్ కాదు. మరి ఏజెంట్ మాటకు కట్టుబడతాడా లేక తప్పుకుంటాడా చూద్దాం