iDreamPost

టిడిపి కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన.. విశాఖలో ఉద్రిక్తత

టిడిపి కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన.. విశాఖలో ఉద్రిక్తత

విశాఖపట్నం తెలుగుదేశం కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీఎత్తున ధర్నాకు దిగారు. ఇక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ మొదటినుండి వ్యతిరేకిస్తోంది. ఈక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు విశాఖ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నిరసన చేపట్టారు.

విశాఖపట్నంలోని సెవన్ హిల్స్ జంక్షన్‌లో ఉన్న టీడీపీ ఆఫీసు ఎదుతే రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను సైతం దగ్ధంచేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఓ దశలో కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ లోకేజ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆందోళన చేస్తున్న వారిలో మహిళలు కూడా ఎక్కువగా ఉండడంతో కట్టడి చేయడానికి పోలీసులకు ఇబ్బంది ఎదురైంది. ప్రజలందరూ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారని, కానీ తెలుగుదేశం అందుకు అడ్డుపడుతోందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచిన గణేష్, వెలగపూడి రామకృష్ణలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారని, వారు విశాఖకు రావడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విశాఖ ప్రజల ఓట్లతో గెలిచిన మీరు మా మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

అయితే ఈ ఘటనపై విశాఖ టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలా రాజకీయ పార్టీ ఆఫీసులవద్ద ధర్నాలు చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముట్టడించడం వెనుక మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు పక్కనుండి చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేయించారని, విశాఖ ప్రజలు ఎవరూ రాజధాని కావాలని కోరలేదన్నారు.. విశాఖలో అశాంతి నెలకొల్పేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి