iDreamPost

ఏపీ రైతులకు శుభవార్త.. నేడు మరో కొత్త పథకం ప్రారంభిస్తోన్న సీఎం జగన్‌

ఏపీ రైతులకు శుభవార్త.. నేడు మరో కొత్త పథకం ప్రారంభిస్తోన్న సీఎం జగన్‌

వ్యవసాయాన్ని పండగ చేసేలా.. రైతన్నకు అన్ని విధాలుగా అండగా ఉండేదుకు వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ క్రమంలో మరొ పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందించే పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టబోతున్నారు.

వ్యవసాయ రుణాల వార్షిఖ ప్రణాళికను ప్రభుత్వం రెండు దశల్లో అమలు చేస్తోంది. ఖరీఫ్, రబీలలో రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు లక్ష్యాలను నిర్ధేశిస్తుంది. ఈ క్రమంలో గత ఏడాది ఖరీఫ్‌లో లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో (ఏడాదిలోపు) చెల్లించిన రైతులకు వడ్డీ మొత్తం ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పథకానికి వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ అని నామకరణం చేసింది. ఈ పథకానికి గత ఏడాది ఖరీఫ్‌లో 14.58 లక్షల మంది అర్హులయ్యారు. వీరు తీసుకున్న రుణాలకు అయిన వడ్డీ మొత్తం 510 కోట్ల రూపాయలుగా లెక్కతేలింది. ఈ మొత్తాన్ని ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నేడు జమ చేయనుంది.

పెట్టుబడి ఖర్చును తగ్గించేలా రైతులకు ఆర్థిక వెలుసుబాటు కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. రైతులకు పెట్టుబడి తగ్గడంతోపాటు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు వ్యవసాయం పండగలా మారుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం కింద ప్రతి చిన్న, సన్నకారు రైతుకు ఏడాదికి 13,500 రూపాయలు ఇస్తున్నారు. తాజాగా రుణాలు వడ్డీ లేకుండా అందించేందుకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కంపెనీ తయారీ ధరలకే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిస్తున్నారు. ఈ పథకాలు, కార్యక్రమాల వల్ల ఏపీ రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు విలువైన కాలం ఆదా అవుతోంది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం పొందేందుకు రైతులు స్థానిక గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుడును సంప్రదిస్తే సరిపోతుంది. బ్యాంకు నుంచి రుణాలు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. గ్రామ వ్యవసాయ సహాయకుడు ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తోంది. భవిష్యత్‌లో రైతులు బ్యాంకులకు వెళ్లకుండానే రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్యాంకుల సహాయంతో రుణాలు అంది^ంచేందుకు ఇప్పటికే ప్రణాళిక రచించింది. సున్నా వడ్డీ పథకంపై సందేహాలు ఉంటే 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి అడగొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి