iDreamPost

మరో 20 ఏళ్లపాటు వైయస్ జగనే ముఖ్యమంత్రి -కోమటిరెడ్డి

మరో 20 ఏళ్లపాటు వైయస్ జగనే ముఖ్యమంత్రి -కోమటిరెడ్డి

ప్రజాసంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నీ చాలా బాగున్నాయని, ఆ పథకాలన్నీ మంచి సత్ఫలితాలిస్తాయని సీనియర్ కాంగ్రెస్ నాయకులు  తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దర్శనానంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, తండ్రి గారి స్ఫూర్తితో పేద ప్రజలకోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతమై వారి తండ్రి గారి లాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి పేరు తెచ్చుకుంటారని తనకు గట్టి నమ్మకం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆశీసులతో జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఎంపీ ఆకాంక్షించారు. తెలంగాణ రాజకీయాలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతానికి తెలంగాణలో ప్రతిపక్షం బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు.

గతంలో హేమా హేమిల్లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులైన కుందుర్రు జానారెడ్డి, పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రెడ్డి లాంటి సీనియర్ నేతలున్న నల్గొండ జిల్లాలో యువకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ గా సుపరిచితులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సమయం నుండే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. మొదటినుండి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరులుగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను సైతం పక్కకు నెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయంగా బాగా ప్రోత్సహించారు. వైయస్ ఆశీసులతో 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి నల్గొండ ఎమ్మెల్యే టికెట్ పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రముఖ సిపిఎం నాయకుడు నంద్యాల నరసింహారెడ్డి పై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆతరువాత అదే నియోజకవర్గం నుండి ఆయన వరుసగా నాలుగుసార్లు ఎన్నికైయ్యారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా వెనుతిరిగి చూడలేదు. 2009 లో సీనియర్ నేతలను కాదని రాజశేఖర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇదే సంవత్సరం వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టాడు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కూడా వీరు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. వైయస్ కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఒకదశలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరం వైసిపిలో చేరుతామని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటించాడు. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలమీదే ఎక్కువ దృష్టి సారించడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయితే ఇప్పటికి కుడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంచి మిత్రుత్వం వుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి