iDreamPost

యాటిట్యూడ్ ఉంటే హీరో అయిపోవచ్చా? సీనియర్ హీరోలకి, యువ హీరోలకి తేడా ఏంటి?

యాటిట్యూడ్ ఉంటే హీరో అయిపోవచ్చా? సీనియర్ హీరోలకి, యువ హీరోలకి తేడా ఏంటి?

ఒకప్పుడు హీరోలు అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. వాళ్ళు ఏం మాట్లాడినా అది అభిమానులు, ప్రేక్షకుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. సమాజంలోకి, మీడియా ముందుకి వచ్చినప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు, గౌరవంగా, హుందాగా, పద్దతిగా వ్యవహరించేవారు. ఇప్పటికి కూడా చిరంజీవి, బాలయ్య బాబు, వెంకటేష్, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్, పవన్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు చాలా హుందాగా మాట్లాడతారు. పదాలు కూడా ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేలా పలుకుతారు. స్టేజి మీద కానీ, ఇంటర్వ్యూలలో కానీ అడిగిన ప్రశ్నలకి గౌరవంగా సమాధానమిస్తారు.

ఇదంతా సీనియర్ హీరోలకే వర్తిస్తుంది. ఇటీవల వచ్చిన యువ హీరోలు మాత్రం ఇవేమి పట్టించుకోవట్లేదు. చేతిలో మైక్ ఉంటే, ముందు కెమెరా ఉంటే మనల్ని మించిన తోపు ఎవ్వడూ లేడు అని ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ స్పీచ్ లు, మాటలు కూడా ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ఉంటున్నాయి తప్ప సమాజానికి పనికొచ్చే మాటలు ఒక్కటి కూడా ఉండట్లేదు. పైగా వారి అభిమానులని, ప్రేక్షకులని కూడా ఇలాగే ఉండండి, మనం ఎవ్వరికి భయపడవసర్లేదు, మనల్ని ఎవరూ ఏమి పీకలేరు లాంటివి చెప్పి వచ్చే జనరేషన్ కి సభా మర్యాదలు, గౌరవ మర్యాదలు లాంటివి లేకుండా చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్ టైంలో విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడు ఈ యాటిట్యూడ్. ఒక ప్రముఖ సీనియర్ రాజకీయవేత్త ఇతని సినిమాని తప్పు పడితే.. సరి చేసుకుంటాం, లేదా స్టోరీ ఇంతే, ఆ సీన్స్ ఉండాలి అని చెప్పకుండా, తాత నీకెందుకు, చిల్, పడుకో ఇంటికెళ్లి అంటూ సమాజంలోని ఒక పెద్దాయన మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఆ సినిమా హిట్ అయ్యేసరికి విజయ్ కి యాటిట్యూడ్ మరింత ఎక్కువ అయింది. ఇదే యాటిట్యూడ్ యువతకి, టీనేజ్ కి నచ్చి విజయ్ ని మరింత పాపులర్ చేశారు. దీంతో తన ప్రతి సినిమా ఫంక్షన్ లోను రెచ్చిపోయి మాట్లాడేవాడు. ఇటీవల డీజే టిల్లు అంటూ వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ కూడా అంతే మనల్ని మించిన తోపు ఎవ్వడూ లేడు, మనకి ఎవ్వడు అడ్డు రాడు అంటూ రైజ్ అయ్యాడు, ఇప్పుడు విశ్వక్ సేన్ వంతు. విశ్వక్ కూడా ఫలక్ నామా దాస్ సినిమా నుంచే యాటిట్యూడ్ చూపించాడు. ఆ సినిమా కూడా ఎవడైతే నాకేంటి అన్నట్టే ఉంటుంది. ఇలా ఇప్పుడు వచ్చే హీరోలంతా మా ఇష్టం అంటూ చెలరేగిపోతున్నారు. వాళ్ళ సినిమాలు, సినిమాల్లోని డైలాగ్స్ కూడా అలాగే ఉంటున్నాయి.

ఇక యువత కూడా ఇలాంటి వాళ్లనే ఇష్టపడుతుంది. ఆ హీరోలంతా సోషల్ మీడియాలో తమని తామే ప్రమోట్ చేసుకుంటూ ఉండటంతో సోషల్ మీడియా వాడే టీనేజ్, యువత అంతా వీళ్ళు చెప్పిందే వేదం అనుకుంటూ వాళ్ళు చూపించే యాటిట్యూడ్ ఇళ్లలోనూ, వారు చదువుకునే ప్రదేశాల్లోనూ చూపిస్తున్నారు. దీని వాళ్ళ కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. అడిగితే మా హీరో అలా చెప్పాడు, అలా చేసాడు అంటూ సమాధానం ఇస్తున్నారు. జీవితం మీద అవగాహన లేని పిల్లలు కూడా వీళ్ళని చూసి యాటిట్యూడ్ అంటూ తిరుగుతున్నారు. చాలా మంది టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్ గమనిస్తే వారి బయోలో యాటిట్యూడ్ మ్యాటర్స్ అంటూ కొటేషన్స్ పెడుతున్నారు అంటే వాళ్ళ ప్రభావం ఎంతగా పిల్లల మనస్సులో విష ప్రయోగం చేస్తుందో ఆలోచించండి.

ఇక ఇదే విషయం గురించి డైరెక్ట్ గా వాళ్లనే అడిగి, వాళ్ళ గురించి నెగిటివ్ గా మీడియాలో వేస్తే చాలు, అందరి ముందుకొచ్చి సెంటిమెంట్, ఎమోషనల్ డైలాగ్స్ ఓ నాలుగు వేసి వెళ్ళిపోతారు. ఆ హీరో.. అమ్మా నేను తప్పు చేయలేదు, నా గురించి నీకు తెలుసు, నాకు నా అభిమానులు ఉన్నారు, నన్ను ఎవరూ ఏమి పీకలేరు అనగానే, ఇంకేముంది సోషల్ మీడియాలో ఉండే టీనేజ్ అంతా మా హీరోని అంటారా అంటూ నెగిటివ్, అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడతారు. ఇదంతా ఆ హీరోలు చోద్యం చూస్తూ కూర్చుంటారు. ఇలా యాటిట్యూడ్ చూపిస్తేనే హీరోలవుతామా, స్టార్ డం వస్తదా అని మిగిలిన వచ్చే హీరోలని కూడా ఇలాగే తయారు చేస్తున్నారు.

మెగాస్టార్ లాంటి రేంజ్ ఉన్న వ్యక్తి  నాకంటే తోపు ఎవ్వడు లేడు అనుకోకుండా అభిమానుల ముందు చాలా హుందాగా, పద్దతిగా ఇప్పటికి మాట్లాడతారు. యువ హీరోలు ఆయన్ని చూసి ఇది నేర్చుకోవాలి. ఇక ఎన్టీఆర్, మహేష్, పవన్ లాంటి హీరోలు అభిమానులని జాగ్రత్తగా ఉండండి, రోడ్ల మీద నెమ్మదిగా వెళ్ళండి అని చెప్తున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనం.  యాటిట్యూడ్ అనేది ఉండాలి తప్పు లేదు, కానీ అది ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి