iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా రాని స్పష్టత

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా రాని స్పష్టత

స్థానిక సంస్థల్లో ఎస్సి, ఎస్టీ, బిసిలకు 59.85 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై సోమవారం హైకోర్ట్ కొన్ని సందేహాలు లేవనెత్తింది. తమకున్న సందేహాలను నివృత్తి చెయ్యాలని అటు పిటిషనర్ల తరపు లాయర్లతో పాటు ఇటు ప్రభుత్వం తరపు అడ్వకెట్ జనరల్ శ్రీరామ్ ను కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య లతో కూడిన ధర్మాసనం ముందు ఈరోజు కూడా ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి.

ఎపి బిసి కార్పొరేషన్ లిమిటెడ్ రాజ్యాంగంలోని 340 అధికరణ కింద ఏర్పాటయ్యిందా ?? బిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసే అధికారాన్ని ఆర్టికల్ 340 కింద రాష్ట్రపతికి కట్టబెట్టిందా ?? బిసి ల సామాజిక వెనుకబాటుతనం పై నిగ్గు తేల్చాలని కోరే అధికారం రాష్ట్రపతికి ఉందా ?? సామాజిక విద్యాపరమైన వెనుకబాటు తనానికి కేంద్రం లేదా రాష్ట్రాన్ని తగిన చర్యలు తీసుకోమని సిఫార్స్ చేసే అధికారం బిసి కమిషన్ కు ఉందా ?? 102 వ రాజ్యాంగ సవరణ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని నిర్ధారిస్తూ రాష్ట్రపతి ఏమైనా నోటిఫికేషన్ జారీ చేశారా ?? ఇలా తమకున్న పలు సందేహాలు నివృత్తి చెయ్యాలని సోమవారం ప్రభుత్వ అడ్వకెట్ జనరల్ ని కోరింది.

ఈ నేపథ్యంలో మంగళవారం కూడా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం దీనిపై తమకు ఇంకా కొన్ని సందేహాలున్నాయని చెబుతూ తుది తీర్పుని రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కోర్ట్ నుండి ఇంకా స్పష్టత రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల పీటముడి ఎప్పుడు వీడుతుందా అని హైకోర్టు తుది తీర్పు కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ఎస్సి, ఎస్టీ, బిసిలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై కొందరు సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనల విన్న సుప్రీం కోర్ట్ గతనెల 17న ఈ కేసును రాష్ట్ర హైకోర్టు కి బదిలీ చేస్తూ, హై కోర్ట్ తుది తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని సుప్రీం కోర్ట్ సూచించింది. అయితే ఈ రిజర్వేషన్ల అంశంలో విచారణని నెల రోజులలోగా పూర్తి చెయ్యాలని, హైకోర్ట్ ని సుప్రీం కోర్ట్ సూచించినప్పటికీ.. హైకోర్టు లో ఇంకా విచారణ పూర్తి కాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి