iDreamPost

టిడిపిని వదిలేసి బిజెపికి జాకీలేస్తున్న ఎల్లోమీడియా ..సీన్ అర్ధమైపోయిందా ?

టిడిపిని వదిలేసి బిజెపికి జాకీలేస్తున్న ఎల్లోమీడియా ..సీన్ అర్ధమైపోయిందా ?

రాజకీయంగా తెలుగుదేశంపార్టీ పని దాదాపు అయిపోయినట్లుగా ఎల్లోమీడియా భావిస్తోందా ? ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొత్తపలుకు చదివిన వాళ్ళకు ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎల్లోమీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణ ప్రతివారం చిమ్మినట్లుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వీలైనంత విషం చిమ్మాడు. అయితే ఈసారి కొత్తగా ఓ విషయం బయటపెట్టాడు. అదేమిటంటే టిడిపిని వదిలేసి బిజెపికి జాకీలేయటం. రాజకీయంగా తెలుగుదేశంపార్టీ పని అయిపోయిందని పాపం రాధాకృష్ణకు కూడా అనుమానం వచ్చినట్లుంది. అందుకనే చంద్రబాబునాయుడను వదిలేసి బిజెపిని లేపే పని మొదలుపెట్టాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే ’వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంపార్టీతో అవగాహన ఉంటుందని, సీటు గ్యారెంటీ అని హామీ ఇస్తే… పదిమందికి పైగా ఎంపిలు బిజెపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది’ అని ఓ విచిత్రమైన విషయం చెప్పాడు. బహుశా రాధాకృష్ణకు ఎవరైనా కలలో కనిపించి చెప్పారేమో తెలీదు. పైగా ’అధికారపార్టీ ఎంఎల్ఏలకంటే ఎంపిలకే అసంతృప్తి ఎక్కువగా ఉంద’ని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంఎల్ఏలకైనా ఎంపిలకైనా జగన్ పై అసంతృప్తి ఉండాల్సిన అవసరం లేదు. పైగా మొన్న గెలిచిన వాళ్ళల్లో అత్యధికులు జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వారే అనటంలో సందేహం లేదు.

ఏడాది క్రిందట అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమ పథకాల అమలుతో జగన్ జనాల్లోకి చొచ్చుకుని పోతున్నాడు. ఆ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గమనిస్తున్నాయి. అందుకనే కదా ఏదో రకంగా ప్రభుత్వంపై బురద చల్లాలని ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని టిడిపి అండ్ కో రాజకీయాలు చేస్తున్నది. ప్రతిపక్షాలకు తెలిసిన విషయం కూడా సొంతపార్టీ ప్రజాప్రతినిధులకు తెలీకుండానే ఉంటుందా ? జనాల్లో జగన్ పాపులారిటి పెరిగిపోతున్నదని గ్రహించిన తర్వాత వైసిపిని వదిలి వెళ్ళేందుకు ఎవరైనా సాహసిస్తారా ?

సరే వీళ్ళ విషయం కాసేపు పక్కనపెట్టి బిజెపి విషయం చూద్దాం. పోయిన ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లెన్ని, 0.84 శాతం. కమలంపార్టీకన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కు వచ్చిన ఓట్లే చాలా ఎక్కువ. మొన్న బిజెపి తరపున 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ సీట్లలో పోటి చేసిన అభ్యర్ధుల్లో ఒక్కరికి కూడా డిపాజిట్ కూడా రాలేదు. మిగిలిన అభ్యర్ధుల సంగతిని పక్కన పెట్టేసినా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట ఎంపిగా పోటి చేశాడు. గెలిచిన వైసిపి అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయులుకు 7,45,089 ఓట్లు వచ్చాయి. ఓడిన టిడిపి అభ్యర్ధి రాయపాటి సాంబశివరాకు 5,91,111 ఓట్లొచ్చాయి.

అదే సమయంలో కన్నాకు ఎంతొచ్చాయో తెలుసా 15,468 ఓట్లు మాత్రమే. కన్నా కన్నా జనసేన అభ్యర్ధి అయ్యూబ్ కలామ్ కు 48 వేల ఓట్లు రావటం గమనార్హం. ఇదీ స్ధూలంగా బిజెపి పరిస్ధితి. ఇటువంటి పార్టీలోకి వైసిపిని వదిలేసి పదిమంది ఎంపిలు వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారని రాధాకృష్ణ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏమి చూసుకుని వైసిపి ఎంపిలు బిజెపిలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో రాధాకృష్ణే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే వైసిపి ఎంపిలు బిజెపిలోకి వెళతారని అన్నాడే కానీ టిడిపిలో చేరుతారని చెప్పలేదు. వైసిపిని వదిలేసే ఎంపిలు బిజెపిలోకి వెళ్ళే బదులు వెళ్ళేదేదో టిడిపిలోకి రావటానికే సిద్ధంగా ఉన్నట్లు రాయచ్చు కదా ?

అలా ఎందుకు రాయలేదంటే టిడిపిలో నుండి ఎంఎల్ఏలు బయటకు వచ్చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నపుడు వైసిపి ఎంపిలు టిడిపిలోకి వెళ్ళబోతున్నట్లు రాస్తే జనాలు నవ్వుకుంటారని అనుమానించినట్లున్నాడు. టిడిపితో అవగాహన ఉంటుందని, టిక్కెట్టు ఇస్తామని హామీ ఇస్తే పదిమంది ఎంపిలు బిజెపిలో చేరుతారని చెప్పటమే పెద్ద జోక్. ఎందుకంటే బిజెపి తరపున పోటి చేసే గట్టి నేతలే లేనపుడు పదిమంది ఎంపిలు వచ్చేస్తామని అంటే కమలం నాయకత్వం టిక్కెట్లు ఇవ్వనని చెబుతుందా ? టిడిపితో అవగాహన ఉంటుందని చెప్పాలని ఎంపిలు షరతు విధించారని చెప్పటమే విచిత్రంగా ఉంది.

టిడిపితో అవగాహన ఉంటేనే బిజెపిలో చేరుతామని కమలంపార్టీ నేతలను బతిమలాడుకునే బదులు అదేదో నేరుగా టిడిపిలోనే చేరిపోవచ్చు కదా ? తమ పార్టీలో చేరుతానంటే చంద్రబాబు వద్దంటాడా ? టిక్కెట్లు ఇవ్వనంటాడా ? ఏ విధంగా చూసుకున్నా బిజెపికన్నా టిడిపినే గట్టి పార్టీ అన్న విషయం రాధాకృష్ణకు తెలీదా ? వైసిపి ఎంపిలకు తెలీదా ? తెలిసి కూడా ఇలా రాశాడంటే కచ్చితంగా ఇది గాలి వార్తనే విషయం అర్ధమైపోతోంది. ఇదే సమయంలో ఎందుకైనా మంచిదని బిజెపికి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నట్లున్నాడు. అందుకనే టిడిపిని వదిలేసి బిజెపికి జాకీలేసే పని మొదలుపెట్టినట్లే అనుమానంగా ఉంది. ఇందులో భాగంగానే వైసిపి ఎంపిల గురించి పిచ్చి రాతలు మొదలుపెట్టాడు. చూద్దాం భవిష్యత్తులో ఇంకెన్ని పలుకులు పలుకుతాడో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి