iDreamPost

ఎమ్మెల్యే ఫిరాయింపు వార్తల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలిసిందేగా..!!

ఎమ్మెల్యే ఫిరాయింపు వార్తల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలిసిందేగా..!!

సాధారణంగా మీడియాకు అనేక సందర్భాల్లో ఆత్రుత ఎక్కువ. ముఖ్యంగా ఓ వర్గం మీడియాకు మరీ ఎక్కువ. ఒకరి/ఒక పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఇలా.. వీరు ఇలా.. అంటూ ఊహాజనిత కథనాలు ప్రచురించడం/ప్రసారం చేయడం, అది నిజమైతే మేం ముందే చెప్పాం అంటూ రోజు మొత్తం బ్రేకింగ్‌లు పెట్టడం, నిజం కాకపోతే కనీసం ఖండన కూడా చెప్పకుండా గమ్మున ఉండిపోవడం ఆ మీడియాకు అలవాటు.

రాజకీయ వార్తల విషయంలో ఇది మరీ ఎక్కువ. ఫిరాయింపుల విషయమే తీసుకుందాం.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ నుంచి అధికార టీడీపీలోకి వారు వెళ్తున్నారు, వీరు వెళ్తున్నారు అంటూ చెప్పి, వారిని మానసిక ఒత్తిడికి గురిచేసి చివరికి పార్టీ మారేందుకు తమ వంతు సాయం చేసింది ఓ మీడియా. అంతటితో ఆగకుండా పార్టీ మారిన వాళ్లతో ఇంటర్వ్యూలు పెట్టి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై రాళ్లు రప్పులు కాదు ఏకంగా విమర్శల బండలు వేయించడం గత ఐదేళ్లూ చూశాం. తద్వారా పార్టీ సీటు ఇచ్చి గెలిపించిన వ్యక్తిదే తప్పు తప్ప.. ఫిరాయించిన వ్యక్తిదీ కాదు, చేర్పించుకున్న వ్యక్తిదీ కాదు అనే భ్రమను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేసింది.పైగా అభివృద్ధి చూసి విపక్ష ఎమ్మెల్యేంతా ముచ్చటపడుతున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కేది. అఫ్‌కోర్స్‌ ప్రజలెవరూ ఆ మీడియా మాటలను నమ్మలేదు సరికదా.. తమ ఓటుతో ఆ మీడియా సపోర్ట్‌ చేసిన పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు.

ఎన్నికలు అయిపోయాక.. ఇప్పుడు అదే మీడియా తన స్టాండ్‌ మార్చుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి ఎమ్మెల్యేలు జారిపోకుండా కొత్త మైండ్‌గేమ్‌కు తెరతీసింది. అప్పట్లో వారు వెళ్తున్నారు, వీరు వెళ్తున్నారు అంటూ మాట్లాడిన మీడియా.. ఇప్పుడు వారిని లాక్కుంటున్నారు, వీరిని లాక్కుంటున్నారు అంటూ ప్రచురించటం మొదలుపెట్టింది. అంటే అప్పట్లో ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి పంపడానికి కృషి చేసిన మీడియా.. ఇప్పుడు ఇప్పటి అధికార పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు తన వంతు కృషి చేస్తోంది.

వాస్తవానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క టీడీపీ ఎమ్మెల్యేనూ వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకోలేదు. టీడీపీ అధినేత తమపై చూపుతున్న వివక్షను తట్టుకోలేక, తమను ఎదగకుండా చేస్తున్న ప్రయత్నాలను ఓర్చుకోలేక ఆ పార్టీకి దూరం జరిగారు. అంతేగానీ వైఎస్సార్‌సీపీలో చేరలేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాలి గిరి అందుకు ఉదాహరణ. తమ నియోజకవర్గ సమస్యలపై సీఎం జగన్‌ను కలవడం, ఆయన సానుకూలంగా స్పందించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని ఓర్చుకోలేని టీడీపీ, ఆ వర్గం మీడియా ఆ ఎమ్మెల్యేలపై కక్ష కట్టి కథనాలు వేయడం, గల్లీ లీడర్లతో విమర్శలు చేయించడం చేసింది. రాజీనామా చేయకుండా ఏ ఒక్క ఎమ్మెల్యేలనుగానీ, ఎమ్మెల్సీనిగానీ, ఎంపీనిగానీ చేర్చుకోబోమని గతంలో చెప్పడమే కాకుండా శిల్పా చక్రపాణిరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు విషయంలో నిరూపించారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పుడు కూడా అంతే రాజీనామా చేయకుండా ఏ ఒక్క ఎమ్మెల్యేనూ చేర్చుకోలేదు.

టీడీపీ బహిష్కరణకు గురైన వల్లభనేని వంశీ కానీ మద్దాలి గిరి కానీ ముఖ్యమంత్రిని రెండవసారి కలిసే అవకాశం రాకపోవటం గమనార్హం. టీడీపీని వీడిన ఏ ఎమ్మెల్యేకు రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తామన్న వాగ్దానం కూడా జగన్ చేయలేదు. వంశీ లాంటి నేత చేసిన ఆరోపణలు టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఓటమి తరువాత లావాలా పెల్లుభికినట్లు భావించాలి.

ఇప్పటికి అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు .. వీరు ఎప్పుడైనా టీడీపీని వీడటం ఖాయం అన్న అంచనాకు అటు చంద్రబాబు ఇటు దాని సపోర్టింగ్ మీడియా వొచ్చింది… అందుకే వరుస కధనాలు మొదలు పెట్టి మైండ్ గేమ్ ఆడుతున్నారు,ఈ వ్యవహారం దసరాకు కాకుంటే సంక్రాంతికి,అప్పడు కూడా కాకుంటే ఉగాది ఎలాగూ ఉంది కదా అన్నట్లు ఉంది.

టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు అంటూ కథనాలు వేస్తోంది. పైగా వారిని బెదిరిస్తున్నారని, వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని కథనాలు వేస్తోంది. వీటన్నిటి వెనుక తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి