iDreamPost

సిబిఐ విచారణ స్వాగతిస్తున్న అధికార పార్టీ..బిత్తరపోయిన టిడిపి

సిబిఐ విచారణ స్వాగతిస్తున్న అధికార పార్టీ..బిత్తరపోయిన టిడిపి

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికార వైసిపి స్వాగతిస్తోంది. మామూలుగా ప్రతిపక్షాలు సిబిఐ విచారణ డిమాండ్ చేయటం, అధికారపార్టీ పట్టించుకోకపోవటం సహజంగా అందరు చూసేదే. కానీ ఇక్కడ రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా హైకోర్టు వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. నిజానికి హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని జనాలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సిబిఐతో విచారణ చేయించేంత తీవ్రమైనది కాదు ఈ వివాదం.

అయితే ఎప్పుడైతే హైకోర్టు సిబిఐ విచారణ చేయించనున్నట్లు చెప్పిందో వెంటనే అధికారపార్టీ నేతలు స్వాగతించారు. దాంతో ప్రధాన ప్రతిపక్షం టిడిపి నేతలు బిత్తరపోయారు. ఎందుకంటే డాక్టర్ వెనుక చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉండి వ్యవహారం నడిపిస్తున్నారంటూ వైసిపి నేతలు ఎప్పటి నుండో చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. సరే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఎలాగున్నా మొత్తానికి సిబిఐ విచారణను మాత్రం వైసిపి స్వాగతిస్తోంది.

ఇందులో భాగంగానే చంద్రబాబు కాల్ లిస్టును కూడా బయటకు తీయాలంటూ బాపట్ల ఎంపి నందిగం సురేష్, విజయవాడ ఎంఎల్ఏ మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ చేయించటం మంచిదే అన్నారు వీళ్ళు. డాక్టర్ వివాదం వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం బయటపడాలంటే కచ్చితంగా సిబిఐతో విచారణ చేయించాల్సిందే అంటూ వీళ్ళు చెప్పటంతో టిడిపి నేతల్లో అయోమయం మొదలైంది. సిబిఐ విచారణ అవసరం లేదని వైసిపి నేతలు అంటే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చని టిడిపి అనుకున్నది.

అలాంటిది ఉల్టాగా అధికారపార్టీ నేతలే స్వాగతించటంతో పాటు చంద్రబాబు కాల్ లిస్టు కూడా బయటకు తీయాలని డిమాండ్ చేయటంతో ఏమి చేయాలో టిడిపి నేతలకు తోచటం లేదు. తన కాల్ లిస్టును బయటపెట్టటానికి చంద్రబాబు కూడా ఒప్పుకోవాలంటూ వైసిపి నేతలు సవాలు విసురుతున్నారు. మరి దీనికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంగీకరిస్తాడా ? చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి