iDreamPost

‘బాబు అప్పులు, బకాయిలు పెట్టి వెళ్లాడు.. విద్యుత్‌ ఛార్జీలు స్వల్పంగా పెంచక తప్పలేదు’

‘బాబు అప్పులు, బకాయిలు పెట్టి వెళ్లాడు.. విద్యుత్‌ ఛార్జీలు స్వల్పంగా పెంచక తప్పలేదు’

చంద్రబాబు ఐదేళ్ల పదవీ కాలంలో విద్యుత్‌ సంస్థల అప్పులు భారీగా పెరిగిపోయాయని, వేలకోట్ల రూపాయల బకాయిలు, ట్రూఅప్‌ ఛార్జీలు పెండింగ్‌లో పెట్టి వెళ్లారని, ఫలితంగా స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రభుత్వంపై గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘‘ గతం నుంచి పడిన అప్పులు భారం, ఈ మూడేళ్లలో పెరిగిన ఖర్చుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా పెంచకతప్పలేదు. ఎక్కువగా వినియోగించే వారికే స్వల్పంగా భారం పడుతోంది. దిగువ స్థాయి వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే నిన్నటి నుంచి టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో ఎక్కువగా వసూలు చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని మా ప్రభుత్వం కోరుకోదు. ప్రజల నుంచి వచ్చే ప్రతి రూపాయి వృథా కాకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు పెడుతున్న వైఎస్‌ జగన్‌.. ప్రజలపై భారం పడే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. విద్యుత్‌ ఛార్జీలు అడ్డగోలుగా, అసంబద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం పెంచిన సమయంలో తాము ప్రశ్నించాం.

తన పాలన ఐదేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. బాబు హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచిన విషయం ఆ పార్టీ అనుకూల పత్రికలే రాశాయి. పైగా మిగులు విద్యుత్‌ ఉందని చెప్పుకుంటున్నారు. పరిశ్రమలు లేకపోతే, ఎక్కువ ధరకు పీపీఈలు చేసుకుని ప్రభుత్వ ఖజానాపై భారం పడేలా చేస్తే.. మిగులు ఎందుకు ఉండదు..? వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో 42 వేల కోట్ల రూపాయల భారం మోపిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎక్కడ పెంచామో ఆయన చెప్పాలి. మూడేళ్లలో రూపాయి కూడా పెంచలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుటికప్పుడు విద్యుత్‌ బిల్లులు ఇవ్వడం వల్ల వినియోగదారులపై భారం తగ్గింది. చంద్రబాబు ప్రభుత్వం 19 వేల కోట్ల రూపాయల ట్రూఅప్‌ ఛార్జీలు వేయాల్సింది లేదా ఆ ప్రభుత్వం భరించాల్సి ఉంది. కానీ ఆయన చేయలేదు. ఆయన వదిలివెళ్లిపోయిన పాపాల భారం వల్ల తాము ట్రూఅప్‌ ఛార్జీలు వేశాం.

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్‌ సంస్థలకు 20,790 కోట్ల రూపాయల అప్పు ఉండగా 2019 నాటికి 69 వేల కోట్లకు పెంచారు. 2014లో విద్యుత్‌ బకాయిలు 2,845 కోట్లు ఉంటే.. 21,540 కోట్లకు పెంచారు. మరి చంద్రబాబు ఏమి చేసినట్లు. అప్పులు పెంచారు. బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. మరి వచ్చిన ఆదాయం ఏమైంది..? వ్యవసాయ సబ్సిడీలను తాము ఎప్పుటికప్పుడు అమలు చేస్తున్నాం. ఈ క్రమంలో స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలను పెంచాల్సి వచ్చింది. ఈ పాపం చంద్రబాబుదే. నాడు చంద్రబాబు విద్యుత్‌ బకాయిలు పెట్టిన ఫలితమే..’’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి