iDreamPost

విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల తీర్పు సారాంశం అదేనా

విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల తీర్పు సారాంశం అదేనా

రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి. ఫ్యాన్ గాలి ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు స్పష్టమయ్యింది. జగన్ పాలనకు పల్లె ఓటరు మాత్రమే కాకుండా పట్టణ ప్రజలు కూడా పట్టం కట్టినట్టు స్పష్టమవుతోంది. సుమారుగా 60 శాతం ఓట్లు, సీట్లు అధికార పార్టీకి దక్కడం విశేషంగా మారింది. గతంలో ఎన్నడూ ఏపార్టీకి దక్కనంత మెజార్టీ ఇప్పటికే పంచాయతీలలో దక్కగా, తాజాగా మునిసిపాలిటీలలో కూడా అదే కొనసాగుతోంది.

ఇక కీలకమైన విజయవాడ , గుంటూరు కార్పోరేషన్ ఫలితాలు కూడా అదే పరంపరను కొనసాగించాయి. టీడీపీ అధినేత స్వయంగా ప్రచారం చేసిన చోట కూడా పరాభవం ఎదుర్కొంటోంది. రాజధాని విషయంలో ఎంత హంగామా చేసినప్పటికీ ఆపార్టీకి ఆదరణ దక్కడం లేదు. సాధారణ ఎన్నికల నాటి సీన్ పునరావృతం అవుతోంది. చివరకు విజయవాడలో మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన కేశినేని శ్వేత కూడా ఓ సందర్భంలో వెనుకబడాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు సిగ్గుందా..పౌరుషం ఉందా అంటూ చంద్రబాబు ఎంతగా గొంతు చించుకున్నా జనం మాత్రం జగన్ పార్టీకే జై కొట్టేశారు.

పాలనా వికేంద్రీకరణ చట్టం రూపొందించిన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో టీడీపీ గంపెడాశతో బరిలో దిగింది. కానీ విజయవాడలో ఆపార్టీ పోటీకి ముందే పరాభవం దిశగా కనిపించింది. వర్గపోరా తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. కులాల తగాదాగా మారిన విషయంలో కేశినేని నాని నాయకత్వాన్ని ఆపార్టీ నేతలే అంగీకరించకపోవడంతో జనం ఆదరించలేని స్థితి వచ్చింది. దాంతో చివరకు కొన్ని చోట్ల పోటీ ఇవ్వగలిగినా మొత్తంగా టీడీపీ ఆశలు నిరాశ అయ్యింది.

గుంటూరులో కూడా కమ్మ కులానికే మేయర్ పీఠం అని ప్రకటించిన చంద్రబాబుకి అక్కడ కూడా వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. గుంటూరు మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మెజార్టీ డివిజన్లలో వైసీపీ జెండా ఎగిరింది. దాంతో అక్కడ ముందుగా ప్రకటించిన కాపు సామాజికవర్గానికి చెందిన మనోహర్ నాయుడికి మేయర్ పీఠం దాదాపు ఖాయమయ్యింది. దాంతో ఈ రెండు నగరాల్లోనూ ఓటమి పాలయిన టీడీపీకి ఇది తీవ్ర పరాభవంగా చెప్పవచ్చు. కీలకంగా తాము బలమైన పార్టీగా చెప్పుకున్న చోట కూడా టీడీపీకి ఊరట లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా క్లీన్ స్వీప్ దిశగా సాగుతున్న ఫలితాలు టీడీపీని మరింత ఇరకాటంలో నెట్టేసే పరిస్థితి కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి