iDreamPost

తిరుప‌తిలో వైసీపీ తిరుగులేని విజ‌యం

తిరుప‌తిలో వైసీపీ తిరుగులేని విజ‌యం

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీయే ముందంజ‌లో కొన‌సాగుతూ వ‌చ్చింది. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యారు. ఒక్కటంటే ఒక్క రౌండ్‌లోనూ రెండు పార్టీలూ ఆధిక్యతను చూప‌లేక‌పోయాయంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌ధ్యాహ్నాం వెల్ల‌డైన ఫ‌లితాల‌ను బ‌ట్టే తీవ్ర నిరాశ‌తో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికెళ్లిపోయారని వార్తలు కూడా వచ్చాయి. చివ‌ర‌కు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 6,24,728 ఓట్లతో భారీ విజ‌యం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక ల‌క్ష్మి 3,53,190 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 56,820 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా. 2, 71, 106 ఓట్ల బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించడంతో గురుమూర్తి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు అటు తిరుపతి, ఇటు నెల్లూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆనందం వ్య‌క్తం చేశారు.

Also Read : గెలుపు గులాబీదే..!

విప‌క్షాలు ఎన్ని నాట‌కాలు ఆడినా తిరుప‌తి ప్ర‌జ‌లను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. రాళ్లు, దొంగ ఓట్లు.. ఓట్ల‌ను రాల్చ‌లేక‌పోయాయి. క‌నీసం ఏ రౌండ్ లోనూ టీడీపీ ఆధిక్య‌త చూప‌లేక‌పోయిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను ఆరు చోట్ల వైసీపీ ఆధిక్య‌త సాధించ‌గా, ఈసారి ఏడుకు ఏడు చోట్లా కూడా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందింది. తిరుప‌తి అసెంబ్లీ సెగ్మెంట్ లోకూ వైసీపీకే ప్ర‌జ‌లు ప‌ట్టం కట్టారు. ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు, సీఎం జ‌గ‌న్ పాల‌నా ధోర‌ణికి విజ‌యం అందించారు. మ‌రోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. జ‌గ‌న్ వ్యూహం, వారి కృషి ఫ‌లించి వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తికి బ్ర‌హ్మాండ‌మైన విజ‌యం అందించాయి.

అనుకున్న‌ట్లుగానే గ‌తం కంటే ఎక్క‌వ సంఖ్య‌లోనే వైసీపీ ఓట్ల‌ను సాధించ‌గ‌లిగింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్ రావు 55.03 శాతంతో ఏడు లక్షల 22 వేల 877 ఓట్లు సాధించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో పోలింగ్ శాతం 79.03% గా న‌మోదైంది. కానీ ఈసారి పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ న‌మోదైంది. గ‌తంతో పోలిస్తే, తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది. 11, 02,068 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. వాటిలో అత్య‌ధిక మెజార్టీ 6,24,728 ఓట్ల‌ను వైసీపీ సాధించి గ‌తం కంటే స‌త్తా చాటింది.

Also Read : తిరుప‌తి బై పోల్ : గుద్దుకున్నారా..? గుద్దారా..? ఇప్ప‌టికీ మార‌ని తీరు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి