iDreamPost

తీరిపోయిన యశోద సమస్య

తీరిపోయిన యశోద సమస్య

విజయవంతంగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోబోతున్న యశోదకు కోర్టు కేసు రూపంలో కొద్దిరోజుల క్రితం ఒక చిక్కొచ్చి పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా నటించిన వరలక్ష్మి నడిపే కృత్రిమ గర్భధారణ ఆసుపత్రి పేరు ఇవా అని ఉంటుంది. అందులో జరిగే అక్రమాలను సమంతా ఎలా ఎదురుకుంటుందనే పాయింట్ మీద దర్శకులు హరి హరీష్ లు థ్రిల్లర్ టైపు లో ప్రెజెంట్ చేశారు. మంచి వసూళ్లతో డీసెంట్ రన్ దక్కించుకుంది. అయితే నిజంగానే ఆ పేరుతో హైదరాబాద్ లో ఒక ఐవిఎఫ్ హాస్పిటల్ ఉండటంతో తమ పేరుని డ్యామేజ్ చేశారని అయిదు కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ సదరు యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

దీంతో కోర్టు డిసెంబర్ 19 దాకా ఓటిటిలో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. డిజిటల్ ప్రీమియర్ డేట్ ని దగ్గర్లో ఫిక్స్ చేసుకున్న ఒప్పందానికి ఇబ్బందులు తలెత్తడంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ రంగంలోకి దిగి స్వయంగా ఇవా సెంటర్ ని సందర్శించారు. ఎండి మోహన్ రావుతో కలిసి సమస్య పరిష్కారానికి చర్చలు జరిపి ఇకపై యశోద ఏ రూపంలో వచ్చినా అందులో ఇవా పేరు కానీ మాటల్లో దాని ప్రస్తావన రాకుండా ఎడిట్ చేయిస్తామని చెప్పి కేసుని విత్ డ్రా చేసుకునేందుకు ఒప్పించారు. అయితే థియేటర్లలో చేయాలంటే మళ్ళీ సెన్సార్ అవసరం కాబట్టి దానికి పట్టే టైంని అర్థం చేసుకోవాలనే అభ్యర్థనకు ఇవా సరేనంది

ఇకపై యశోదకు ఎలాంటి చిక్కులు లేనట్టే. సమంతా టైటిల్ రోల్ పోషించిన ఈ మెడికల్ మాఫియా థ్రిల్లర్ కోసం ఓటిటి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. థియేటర్లో మిస్ అయినవాళ్లకు ఇంట్లోనే చూసేందుకు ఇది మంచి ఆప్షన్. అనారోగ్యం దృష్యా సామ్ ఇంకా డిశ్చార్జ్ కానీ నేపథ్యంలో వ్యూస్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక కథ రాసుకునేటప్పుడు అందులో వ్యక్తులు సంస్థ పేర్లు తదితర విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి కేసుల వల్ల సమయంతో పాటు బోలెడు వ్యయం భారంగా మారుతుంది. అప్పట్లో రామ్ చరణ్ నాయక్ లో ఓ ప్రాంతపు నాయకుడి పేరు విలన్ కి పెట్టారని గొడవ జరిగితే దాన్ని మ్యూట్ చేస్తే కానీ చిక్కు తొలగలేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి