iDreamPost

త్రివిక్రమ్ గురించి తెలియని విషయాలు

త్రివిక్రమ్ గురించి తెలియని విషయాలు

మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం, చిరునవ్వుతో లాంటి సినిమాలతో సంభాషణల రచయితగా అవార్డులు సైతం సాధించిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక టాలీవుడ్ కో కొత్త పోకడ పరిచయం చేసిన మాట వాస్తవం. అయితే త్రివిక్రమ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అతని క్లాస్ మెట్ అబ్బూరి రవి ద్వారా తెలుసుకోవచ్చు. బొమ్మరిల్లు, ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న రవి మాటల్లో ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్, అబ్బూరి రవిలు భీమవరంలో 9, 10వ తరగతుల్లో ఒకే బెంచీలో ఈ చివర ఒకరు ఆ చివర మరొకరు కూర్చునే క్లాస్ మేట్స్. అయితే ఆ సమయంలోనే వీళ్ళ స్నేహితులు త్రివిక్రమ్ లోని జ్ఞాన పిపాసను గుర్తించారు. అప్పటికి అబ్బూరి రవి యండమూరి, సూర్యదేవర, మల్లాది నవలలు చదువుతుంటే త్రివిక్రమ్ ఆ స్థాయిని దాటిపోయి అప్పటికే తిలక్ అమృతం కురిసిన రాత్రి లాంటి గొప్ప సాహిత్యాన్ని ఔపాసన పట్టేశాడు. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి పుస్తకాలు చదవడం అంటే మాములు విషయం కాదు కదా. మాములుగా గొప్ప రచయితలు కావాలంటే తప్పనిసరిగా ఉన్నతమైన జ్ఞానాన్ని చదవాలి. దానికి ఆలంబన పుస్తకాలే. ఈ సత్యం పసిగట్టిన త్రివిక్రమ్ వాటి వల్లే బాష మీద పట్టు సాధించాడు.

అబ్బూరి రవి ఇండస్ట్రీకి రావడానికి కారణం తన స్నేహితుడే. ఇటీవలే అల వైకుంఠపురములోతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించిన త్రివిక్రమ్ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 2021 వేసవిలో రిలీజ్ అనుకున్నారు కాని ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల ఖచ్చితంగా దేని డేట్ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అతడు, నువ్వే నువ్వే, ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, జల్సా, అత్తారింటికి దారేది తదితర సినిమాల ద్వారా లైఫ్ ఫిలాసఫీని సింపుల్ డైలాగ్స్ తో సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా సంభాషణలు రాయడం వెనుక అసలు రహస్యం పుస్తక పఠనమే అని అర్థమయ్యిందిగా. సినిమా పరిశ్రమలో రైటర్ కావాలన్నా డైరెక్టర్ అవ్వాలన్న బాషపై పట్టు రావాలి. దానికి కావాల్సిన సదనం ఏమిటో త్రివిక్రమ్ రూపంలో అబ్బూరి రవి ఈ విషయాన్నీ స్వయంగా పంచుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి