iDreamPost

విపత్తు వేళ.. భారత్‌కు ప్రపంచ దేశాల బాసట

విపత్తు వేళ.. భారత్‌కు ప్రపంచ దేశాల బాసట

కరోనా సెకండ్‌ వేవ్‌తో భారత్‌ అల్లాడుతోంది. తొలి దశకు మించి కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డిశ్చార్జిల కంటే కొత్త కేసులు ఎక్కువ ఉంటుండడంతో పలు రాష్ట్రాలలో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి అండగా ఉండేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ అందించి అండగా ఉన్న భారత్‌కు తాము కూడా సహాయం అందిస్తామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాయి.

కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ భారత్‌లో ఉధృతమవుతున్న తరుణంలో ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. కొన్ని దేశాలు వైద్యపరమైన సాయానికి ముందుకు రాగా, మరికొన్ని తమ సానుభూతిని ప్రకటించాయి. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై పలు వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో.. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ శనివారం ఓ ప్రకటన చేశారు. భారత్‌కు సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. ‘‘మేము సాయం చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌, ఇతర ఔషధాలను భారత్‌కు అందజేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా భారత్‌కు వెంటిలేటర్లు, ఔషధాలను పంపే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ‘‘కరోనాపై పోరులో భారత్‌ ముందుంది. ఇతర దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకుంది. ఇప్పుడు భారత్‌తో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం’’ అని ఆస్ర్టేలియా విదేశాంగ శాఖ మంత్రి మెరిస్‌ పేన్‌ ప్రకటించారు. ఫ్రాన్స్‌ అండ ఎప్పటికీ ఉంటుందని, ఏ రకమైన సాయం చేయడానికైనా సిద్ధమేనని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేకరాన్‌ అన్నారు. జర్మనీ ప్రభుత్వం కూడా తమకు వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని, తమ దేశానికి చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ టాటాతో కలిసి 24 ఆక్సిజన్‌ ట్యాంకులను పంపనుందని భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో 4 క్రయోజెనిక్‌ ట్యాంకులను పంపనున్నట్లు సింగపూర్‌ ప్రకటించింది.

Also Read : కరోనా వ్యాక్సిన్‌ అలా కూడా ఉపయోగపడుతోంది..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి