iDreamPost

మహిళలకు పట్టం.. జగన్ ప్రభుత్వం మరో సంచలనం

మహిళలకు పట్టం.. జగన్ ప్రభుత్వం మరో సంచలనం

ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి.. తాతమ్మ అయ్యేవరకు.. ప్రతి మలుపులోనూ వారికి అండగా ఉంటా.. సంక్షేమ ఫలాలు అందిస్తా.. రాజకీయాధికారంలోనూ వారికి సమాన భాగస్వామ్యం కల్పించి మహిళా సాధికారతకు కృషి చేస్తానని వైస్సార్సీపీ పెట్టినప్పటి నుంచి మొన్నటి ఎన్నికల వరకు ప్రతి సందర్భంలోనూ చెబుట్టువస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి పలు నిర్ణయాలతో మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో అక్కచెల్లెమ్మలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న మరో నిర్ణయంతో రాజకీయంగా సంచలనం సృష్టించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు సగం మంది మహిళలే అధ్యక్ష పీఠాలు అలంకరించడం మహిళా సాధికారత దిశగా పెద్ద ముంద డుగన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహిళలే మహారాణులు…

చట్ట ప్రకారం ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అని మహిళా లోకాన్ని పొగడ్తలతో ముంచెత్తినా.. పదవుల కోసం రిజర్వేషన్లు పెట్టాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ అక్కచెల్లెమ్మలకు అన్నింటా సమానావకాశాలు ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మగువలు కేటాయిస్తూ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ, నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ దాదాపు సగం వార్డులు, డివిజన్లలో మహిళలనే వైస్సార్సీపీ అభ్యర్థులుగా నిలిపి కొత్త సంప్రదాయానికి తెర తీశారు.

Also Read:బీసీలు, మహిళలతో కోట కట్టుతున్న జగన్

తాజాగా జరిగిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల విషయంలోనూ అదే పంథా అవలంభించారు. ఎన్నికలు జరిగిన 11 నగరపాలక సంస్థలో ఏడు చోట్ల మహిళా కార్పొరేటర్లనే మేయర్ పీఠంపై కుర్చీబెట్టారు. బీసీ జనరల్, ఎస్సీ జనరల్ స్థానాల్లోనూ ఆడపడుచులకే అవకాశం ఇవ్వడం విశేషం. ఆ విధంగానే గ్రేటర్ విశాఖ, చిత్తూర్ కార్పొరేషన్ల పగ్గాలు మహిళల చేతిలోకి వెళ్లాయి. అలాగే ఎన్నికలు జరిగిన 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 41 చోట్ల మహిళలే అందలమెక్కారు. మిగిలిన చోట్ల ఉపాధ్యక్ష పదవులిచ్చి గౌరవించారు.

రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న, ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ పాలకురాలిగా పెద్దగా రాజకీయ, పాలన అనుభవం లేని సామాన్యురాలికి అవకాశం ఇవ్వడం స్త్రీమూర్తుల సామర్థ్యంపై జగన్ కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కాగా రాష్ట్రంలో రెండో పెద్ద నగర పాలక సంస్థ విజయవాడలో మేయర్ తోపాటు రెండు డిప్యూటీ మేయర్ పదవులను కూడా మహిళలకే ఇవ్వడం సాహసోపేత నిర్ణయమే.

సంక్షేమంలోనూ వారికే..

ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లోనూ అతివలకే అగ్రపీఠం వేస్తున్నారు. అమ్మ ఒడి, వైస్సార్ చేయూత, ఆసరా, ఇళ్ల స్థలాలు,ఇళ్ళు, వితంతు పింఛన్లు, సున్నా వడ్డీ రుణాలు ..తదితర ఎన్నో పథకాలు మహిళల పేరుతో అమలు చేసురున్నారు. మహిళలకు రక్షణ కల్పించే దిశ చట్టంతో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన జగన్ ప్రభుత్వంలో ఒక మహిళ హోమ్ మంత్రిగా, మరో మహిళ ఉప మైఖ్య మంత్రిగా ఉండటం కూడా విశేషమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి