iDreamPost

‘దుబ్బాక’ శకునం మంచికేనా..?!

‘దుబ్బాక’ శకునం మంచికేనా..?!

తెలంగాణాలోని దుబ్బక ఉప ఎన్నికల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశక్తిని పెంచింది. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యేనని ముందునుంచీ సర్వేలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అయితే రౌండ్‌రౌండ్‌కు ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ ఉత్కంఠభరితంగా ఎన్నికల ఫలితాలు నిలిచాయి. చివరికి బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు గెలుపొందారు. దీంతో విజయం బీజేపీవైపే గెలుపు మొగ్గు చూపింది. ఆ పార్టీనేతలు సంబరాల్లో మునిగిపోయారు. టీఆర్‌ఎస్‌ కూడా హుందానేగానే ఈ అంశాన్ని స్వీకరించింది.

అయితే బీజేపీ అభ్యర్ధిగెలవడం ద్వారా ఓటర్ల వైఖరిలో మార్పు స్పష్టమవుతోందని బీజేపీ నాయకులు బల్లలు గుద్దేస్తున్నారు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందన్నదానిపై భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. ప్రజలు బీజేపీని బలంగా కోరుకోవడాని కంటే ఈ విజయంలో వేరే అంశాలు కూడా ఉన్నాయన్నది వారి వాదనగా విన్పిస్తోంది. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్‌పై ప్రజల్లో ఉన్న సింపతీయే ఆయన్ను స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కించేసిందంటున్న వారు కూడా లేకపోలేదు. అదే సమయంలో తెలంగాణా పోలీసులు రఘునందన్‌ ఇంటిపై ఎన్నికల సమయంలోనే దాడులు చేయడం ఆయనపై ఉన్న సింపతీని పెంచేసి విజయానికి దగ్గరచేసిందంటున్నారు.

అంతే కాకుండా బ్యాలెట్‌లో కారును పోలిన రోటీమేకర్‌ కారణంగా కూడా కారు ఓట్లు పోయాయన్న వాదన కూడా విన్పిస్తోంది. స్వల్ప ఆధిక్యమే కావడంతో ఇలా అనేకానేక వాదనలకు ఆస్కారం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఒక్క ఎన్నికతోనే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీవేవ్‌కు ప్రారంభం అనుకోవడానికి లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు పరిశీలకులు. ఒక వేళ ఓటర్ల వేవ్‌ మారితే గనుక ఇలా విజయం దోబూచులాడే పరిస్థితి ఉండదని, ఓటర్లంతా ఏకమై వన్‌సైడ్‌ ఫలితాన్నే ఇచ్చుండేవారని అంచనా వేస్తున్నారు.

వేవ్‌ మొదలైపోయిందని సంబర పడే ఛాన్స్‌ బీజేపీకి ఇవ్వకుండా, లక్ష ఓట్లతో గెలుస్తామన్న టీఆర్‌ఎస్‌కు అవకాశం లేకుండా దుబ్బాక ఓటర్లు తెలివైన తీర్పే ఇచ్చారని, ఈ ఎన్నికల్లో అసలైన విన్నర్లు వాళ్ళేనని అంటున్నావారు కూడా లేకపోలేదు. అసలు తెలంగాణాలో గెలుస్తామా? లేదా? అన్న నైరాశ్యంలో కూరుకుపోతున్న బీజేపీకి ఒక లైఫ్‌లైన్‌ను, మేం తప్ప ఇంకెవ్వరూ గెలవలేరు అంటున్న టీఆర్‌ఎస్‌కు ఒక చిన్న ఝలక్‌ను దుబ్బాక ఓటర్లు చవిచూపించారన్నది ఒప్పుకుని తీరాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి