iDreamPost

మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా..? కేంద్రం తాజాగా నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటి..?

మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా..? కేంద్రం తాజాగా నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటి..?

కరోనా వైరస్‌ ఉధృతి దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌ – అక్టోబర్‌ నెలలో రోజుకు గరీష్టంగా 97 వేల కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్యకు మూడు రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండడం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అద్దం పడుతోంది. కొత్త కేసుల నమోదుతోపాటు మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. ఆక్సిజన్‌ కొరత వల్ల ప్రాణాలు పోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కట్టడికి రెండుదారులు..

ప్రస్తుత పరిస్థితులలో వైరస్‌ కట్టడికి ప్రభుత్వాల ముందు ఉన్నవి రెండే దారులు. ఒకటి.. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడం, రెండు.. లాక్‌డౌన్‌ విధించడం. ఇటీవల కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌పై ముఖ్యమంత్రులతో సమీక్షించిన ప్రధాని మోదీ.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి రానీయోద్దని, లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే ప్రయోగించాలని చెప్పారు. ప్రధాని మాటల ద్వారా లాక్‌డౌన్‌ ఉంటుందనే పరోక్ష సంకేతాలు వచ్చాయి. అయితే అది పరిస్థితి చేయి దాటిపోతుందనుకున్నప్పుడే కావచ్చు.

పరిస్థితి చేయి దాటిపోతోందా..?

ప్రస్తుతం ప్రధాని మోదీ అన్నట్లుగా.. పరిస్థితి చేయి దాటిపోయిందనే నిపుణులు చెబుతున్నారు. రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. రాబోవు రెండు నెలల్లో ఈ సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాలున్నాయి. వైరస్‌ కట్టడికి ఈ రెండు నెలలు ముఖ్యమని చెబుతున్నారు. అయితే రాబోయే రెండు నెలల్లో దేశంలో 130 కోట్లకు పైబడి ఉన్న జనాభాకు వ్యాక్సిన్‌ వేయడం సాధ్యం కాదు. అంత ఉత్పత్తి దేశంలో జరగడం లేదు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 13 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు.

Also Read : కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం భరోసా ఇచ్చింది

అందరికీ వ్యాక్సిన్‌కి ఏడాది..

బహిరంగ మార్కెట్‌లో 50 శాతం వ్యాక్సిన్‌ను విక్రయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత.. ఏడాదిలో 70 కోట్ల డోసులు తయారు చేసేందుకు ప్రణాళికలు రచించామని కోవాక్సిన్‌ తయారు చేసే భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసే సీరం ఇన్సిస్టిట్యూట్‌ మరో 70 కోట్ల డోసులు తయారు చేయగలిగితే.. ఏడాదికి రెండు సంస్థలు 140 కోట్ల డోసులు అందించగలుగుతాయి. ఈ లెక్కన చూసినా దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు వైరస్‌ వ్యాప్తిని ఎలా నియంత్రించాలి..? వ్యాక్సిన్‌ తీసుకున్నా.. వైరస్‌ సోకుతుండడం కలవరపెడుతోంది.

పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు..

ఈ పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లాక్‌డౌన్‌ అనుమానాలకు బలం చేకూరుతోంది. దేశంలోని పేద ప్రజలకు మే, జూన్‌ నెలలకు గాను ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలని నిర్ణయించింది. ఒక వ్యక్తికి 5 కేజీల చొప్పన ఆహారధాన్యాలు అందించబోతున్నారు.గత ఏడాది మాదిరిగానే గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం ద్వారా 80 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మే 2 తర్వాత నిర్ణయం..?

ఈ నిర్ణయంతోనే మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి. మే, జూన్‌ నెలల్లో లాక్‌డౌన్‌ విధించి వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తూనే.. మరో వైపు వ్యాక్సిన్‌వేయడం ద్వారా ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలనే ఆలోచనను కేంద్రం చేసే అవకాశాలు లేకపోలేదు. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండోచ్చు.

Also Read : రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ మేమే ఇస్తాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి