iDreamPost

షారుఖ్ సినిమాకు పోటీగా అఖండ రిస్కు

షారుఖ్ సినిమాకు పోటీగా అఖండ రిస్కు

అసలే ఇది ఓటిటి కాలం. ఏదైనా సూపర్ హిట్ సినిమా డబ్బింగ్ అయినా రీమేక్ అయినా వీలైనంత త్వరగా చేసేయాలి. లేదంటే వాటి గురించి తెలుసుకున్న ప్రేక్షకులు బాష రాకపోయినా సబ్ టైటిల్స్ సహాయంతో చూసేసి తమ ఆత్రం తీర్చుకుంటారు. అక్కడితో ఇది ఆగదు. దాని కథాకమామీషు అభిప్రాయాలూ అన్నీ సోషల్ మీడియాలో పంచేసుకుంటారు. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఆడకపోవడానికి కారణం ఇదే. గాడ్ ఫాదర్ ఇక్కడికి రాకముందే దాని తెలుగు వెర్షన్ లూసిఫర్ ని అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడో ఏడాది కిందే చూసిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. అలాంటిది థియేట్రికల్ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే.

అఖండ హిందీలో ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. 2021 డిసెంబర్ లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సాధించిన రికార్డులు జనాలకు గుర్తే. దర్శకుడు బోయపాటి శీను ఎంత ఊర మాస్ గా తీసినా అఘోరా పాత్ర ద్వారా పండించిన యాక్షన్ ప్లస్ ఎమోషన్ బాగా పండటంతో గొప్ప ఫలితం వచ్చింది. ఆ తర్వాత డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు. ఇదంతా జరిగి పదమూడు నెలలు అయిపోయాయి. ఇప్పుడు తాపీగా నార్త్ ఆడియన్స్ కోసం అనువాదం చేసి వదులుతున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు టైమింగే రాంగ్ గా తోస్తోంది. నెల రోజుల నుంచి డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో శుక్రవారాలు మంచి అవకాశాలు ఇచ్చాయి

కానీ వాటిని వాడుకోకుండా ఇలా హఠాత్తుగా జనవరి 20కి లాక్ చేయడం వెనుక కొన్ని సమస్యలు ఉన్నాయి. సరిగ్గా అయిదు రోజుల తర్వాత 25న షారుఖ్ ఖాన్ పఠాన్ వస్తోంది. దీపికా పదుకునే ఎక్స్ పోజింగ్ ఆల్రెడీ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన పఠాన్ కి సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. ఇన్నేసి అంచనాలు ఉన్న ఈ మూవీకి హయ్యెస్ట్ రిలీజ్ ఇవ్వబోతున్నారు. దీంతో సహజంగానే అఖండను అక్కడి ప్రేక్షకులు లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు కేవలం అయిదు రోజుల గ్యాప్ తో పఠాన్ తో తలపడటం బాలయ్యకి ఖచ్చితంగా రిస్కే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి