iDreamPost

జగన్‌ ఊరెళితే.. ఈళ్ళకెందుకంట భయం..!

జగన్‌ ఊరెళితే.. ఈళ్ళకెందుకంట భయం..!

సాధారణంగా ఓ వయస్సు వచ్చేవరకు సరదాగా ఊరెళతాము అనంటే కూడా పిల్లలు వొద్దొద్దని మారాం చేస్తుంటారు తల్లిదండ్రుల దగ్గర. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమోనని ఆ వయస్సుకి వారికి భయమే ఇందుకు కారణం. అయితే ఏపీ రాజకీయాల్లో కూడా సీయం హోదాలో వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళతాను అనగానే తెలుగుదేశం పార్టీ అధినేతతో సహా పలువురు ఆ పార్టీ నేతలు, సోషల్‌ మీడియా వింగులు భయపడి, ముందుగానే నోటికొచ్చిన ఆరోపణలతో తమ భయాన్ని దాచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు.

బీజేపీ పెద్దలు క్లాస్‌ పీకారని, ఇంకేదో అనేసారని, ఇంకోటేదో చేస్తామన్నారని.. ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడేయడంతో పాటు, సోషల్‌ మీడియా వేదికగా పోస్టింగ్‌లు కూడా పెట్టేసుకుని తమ మనస్సులోని భయాన్ని ఆ రూపంలో బైటకు చెప్పుకుంటున్నారంటున్నారు. నిజానికి సీయం హోదాలోని వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకులను కలిసేటప్పుడు ఎంతో అవసరపడితే తప్ప మూడవ వ్యక్తి వారి మధ్య ఉండడు. ఇది దాదాపు అందరి సీయంలు ముఖాముఖీ సమావేశాల్లోనూ జరిగేదే. ఇదే తీరు ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ పర్యటనలో కన్పిస్తుంది. కానీ అటువంటి ముఖాముకీ సమావేశం జరిగే గదికి కూడా రంధ్రం పెట్టి, దానికి చెవి ఆనించి విన్నట్టుగానే టీడీపీ నాయకులు, వారి భజన బృందాల తీరు ఉండడం పట్ల జనం విస్తుబోతున్నారు.

ఇటీవలే ఢిల్లీ వెళ్ళినప్పుటి నుంచి ఉలిక్కిపడుతున్న టీడీపీ నాయకులు, ఇప్పుడో రెండోసారి మళ్ళీ వెళుతున్నారనగానే మరోసారి విమర్శలకు దిగేందుకు అస్త్రాలు వెతుక్కుంటున్నారు. అయితే వీటినే మాత్రం పట్టించుకోకుండా జగన్‌ తన పనిమాత్రం తాను చేసుకుపోతున్నాడు.

విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ బీజేపీకి ఏపీ సీయం, ఏపీ సీయంకి బీజేపీ అవసరం ఉందన్నది పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి, ఫైబర్‌ గ్రిడ్‌లపై సీబీఐ ఎంక్వైరీ ఇలా ప్రాధాన్యతాంశాలను సాధించుకునే లక్ష్యంతో జగన్‌ పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మిత్రపక్షాలు ఒకొక్కటిగా హేండ్‌ ఇస్తున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోనే ఒక రాష్ట్రంలో అత్యధిక ఎంపీల బలం ఉన్న జగన్‌తో మిత్రత్వం పెంచుకోవడం తమకు మేలన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందంటున్నారు. ఇలా ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంతోనే తరచూ సమావేశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఇదంతా పక్కన పెట్టేసి ‘అమ్మా నువ్వు ఊరెళ్ళొద్దు.. నాన్నా నువ్వు వెళ్ళొద్ధు..’ అంటూ చిన్నపిల్లల మాదిరిగా భయంతో కూడిన మారాం చేసేవాళ్ళనేమనాలి అన్న సందేహం ఎదురుకాకమానదు. ఇదే తీరు కొనసాగితే ‘పిల్లలూ పక్కకెళ్ళి ఆడుకోండి’ అని ప్రజలు టీడీపీని మరోసారి అనకమానరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి