iDreamPost

ఇవే ప్రతిపక్షాలు ఆరోజు మోడి నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నించ లేదు ?

ఇవే ప్రతిపక్షాలు ఆరోజు మోడి నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నించ లేదు ?

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళ నుండి మూడేళ్ళకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుదించగానే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రభుత్వ నిర్ణయంపై కుల, కక్షసాధింపు చర్యలుగా ముద్రవేసి రెచ్చిపోతున్నారు ప్రతిపక్ష నేతలు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేధింపు చర్యల్లో భాగంగానే జగన్ పదవీ కాలాన్ని కుదించినట్లు మండిపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదవీ కాలాన్ని కుదించటమన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టమే. నిమ్మగడ్డను ఇబ్బంది పెట్టటానికే పదవీ కాలాన్ని తగ్గించేసినట్లు మండిపోతున్న ప్రతిపక్ష నేతలు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసినపుడు ఎందుకు మాట్లాడలేదు ? సమాచార హక్కు చట్టం చీఫ్ కమీషనర్లు, కమీషనర్ల పదవీ కాలాన్ని యూపిఏ ప్రభుత్వం ఐదేళ్ళుగా నిర్ణయించింది. నరేంద్రమోడి రెండోసారి అధికారంలోకి రాగానే చీఫ్ కమీషనర్, కమీషనర్ల పదవీ కాలాన్ని ఐదేళ్ళ నుండి మూడేళ్ళకు కుదించేశాడు.

పార్లమెంటులో ఇదే విషయమై గోల జరిగినా మోడి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మరి జగన్ కు వ్యతిరేకంగా గొంతు చించుకుంటున్న చంద్రబాబు, రామకృష్ణ, కన్నాతో పాటు వాళ్ళ పార్టీల నేతల్లో ఎవరు కూడా మోడి నిర్ణయాన్ని ఎందుకు విమర్శించలేదు ? కన్నా అంటే సేమ్ పార్టీ అనుకున్నా మరి మిగిలిన వాళ్ళకు ఏమైంది ? సరే ఇక్కడ నిమ్మగడ్డ ఏమైనా నిష్ఫక్షపాతంగా వ్యవహరించారా అంటే అదీ లేదు. ప్రభుత్వంతో ఒక్కమాట కూడా చెప్పకుండానే స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసేశారు.

సరే ఏదో చేశారులే అనుకుంటే మొన్నటికి మొన్న లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం పంపిణి చేస్తున్న వెయ్యి రూపాయలు, నిత్యావసరాలను వైసిపి నేతలు పంపిణి చేయటంపై చంద్రబాబు, కన్నా, రామకృష్ణ ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఫిర్యాదు చేయటం ఆలస్యం వెంటనే కలెక్టర్లందరికీ నిమ్మగడ్డ రిపోర్టు ఇవ్వాలంటూ ఆదేశించారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేనే లేదు. అలాంటపుడు అధికారపార్టీ నేతలు పంపిణీ చేస్తే తప్పేమిటో అర్ధం కావటం లేదు. అంటే తాను చంద్రబాబు మనిషే అన్న ఆరోపణలను నిమ్మగడ్డ నిజం చేయదలచుకున్నారా ? అందుకనే జగన్ కూడా నిమ్మగడ్డతో పాటు ఆయన మద్దతుదారులందరికీ ఒకేసారి షాక్ ఇచ్చాడు. మరి చూద్దాం తర్వాత ఏమి జరుగుతుందో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి