iDreamPost

జీహెచ్‌యంసీ ఎన్నికల్లో జనసేన పోటీ వెనుక కారణమేంటి..?

జీహెచ్‌యంసీ ఎన్నికల్లో జనసేన పోటీ వెనుక కారణమేంటి..?

జీహెచ్‌యంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అకస్మాత్తుగా పవన్‌ నుంచి వచ్చిన ప్రకటన ఇప్పుడు తెలంగాణాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో బీజేపీ–జనసేన పొత్తుతో ఈ పోటీలో ఉంటాయా లేక ఎవరికి వారు స్వతంత్రంగా పోటీలో నిలుస్తారా? అన్న చర్చ అక్కడ జోరుగానే సాగుతోంది. అయితే ఈ పరిణామాలను చూస్తున్న పరిశీలకులు మాత్రం జనసేనను పూర్తిగా కమ్మేసుకునేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టు వేసే క్రమంలోనే పవన్‌ ఈ స్టెప్‌ తీసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

పొత్తు ప్రకటన వరకైతే బీజేపీ, జనసేనలు కలిసి ప్రకటించాయి గానీ ఈ రెండు పార్టీల కేడర్‌ నేరుగా ప్రజాక్షేత్రంలోకొచ్చి చేపడుతున్న కార్యక్రమాలేవీ పెద్దగా లేవు. ఏపీలో జనసేన దాదాపు స్తబ్దుగానే ఉంది. దీనికి తోడు పవన్‌ సినిమాల వైపు మళ్ళడంతో ఆ పార్టీ ఉనికినే ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల్లో పోటీకి నిలుస్తాం అన్న ప్రకటన కీలకమనే చెబుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో జోరుమీదున్న బీజేపీకి పవన్‌కళ్యాణ్‌ ప్రకటన లాభం చేకూరుస్తుందా..? నష్టం చేస్తుందా..? అనే చర్చ సాగుతోంది. జనం ఆలోచనల్లో మార్పు వచ్చిందని, ఈ నేపథ్యంలో జీహెచ్‌యంసీ ఎన్నికల్లో కూడా పట్టుబిగించొచ్చనుకుని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పవన్‌ నోటి నుంచి వచ్చిన పోటీ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను ఆలోచనలో పడేశాయని చెబుతున్నారు.

పవన్‌తో పొత్తుతో ముందుకు వెళితే ఉన్న ఇబ్బందులు, ఎవరికి వారు పోటీ చేస్తే ఏర్పడే పరిణామాలను బేరీజు వేసుకునే పనిలోS బీజేపీ నేతలు పడ్డారని వివరిస్తున్నారు. బీజేపీ, జనసేనలు జీహెచ్‌యంసీ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంచనాలు వేసుకుంటున్నారు.

తన అవసరాన్ని వారు గుర్తించే విధంగా అక్కడ జీహెచ్‌యంసీలో ఎన్నికల్లో పవన్‌ స్విచ్‌ నొక్కుతున్నారంటున్నారు. ఒక వేళ ఇదే వాస్తవం అనుకున్నా ఇరు పార్టీలు పొత్తుపై పీటముడి పడ్డట్టేనన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. ఏపీలో పొత్తు పాట పాడిన ఈ రెండు పార్టీలు తెలంగాణాలో వైఖరిని ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. మరోవైపు 2024 ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కన్పించిన ప్రతి వేదికమీద మైకందుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్దంగా ఉందంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో జనసేన పోటీ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

తెలంగాణాలో ఈ రెండు పార్టీలో ఒకరిపట్ల ఒకరు ఏ విధంగా వ్యవహరించనున్నారన్నదాని ద్వారా ఏపీలో వీరి సంయుక్త భవిష్యత్తు ఎలా ఉండొచ్చన్న అంచనాలపై కూడా ఒక క్లారిటీ వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి