iDreamPost

జెన్ కో సరే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోరు సోమూ..?

జెన్ కో సరే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోరు సోమూ..?

ఏపీ జెన్ కో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెల్లూరులో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సోము వీర్రాజు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఏపీ జెన్ కో ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని ప్రకటించారు.

మా ఆందోళన పట్టించుకోరా?

ఏపీ జెన్ కో కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపిన సోము విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ తాము చేస్తున్న ఆందోళనను ఎందుకు పట్టించుకోవటం లేదు? అని ఉద్యోగులు, కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి పైబడి ఆందోళన చేస్తుంటే కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. పైగా నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు ఏటా నిధులను కేంద్రమే ఇస్తోందని సోము సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే స్టీల్‌ప్లాంట్‌ నష్టాలను భరించలేకే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతోందని జనాన్ని నమ్మించడానికి సోము ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు లాభాల్లో ఉన్న ఎల్ఐసీని కేంద్రం ఎందుకు తెగనమ్ముతోంది? బీఎస్ఎన్ఎల్, ఓఎన్జీసీ లను ఎందుకు నిర్వీర్యం చేస్తోంది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ నష్టాలకు కేంద్రం కారణం కాదా?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణకు అవసరమైన క్యాప్టీవ్ మైన్స్ కేటాయించకుండా పథకం ప్రకారం నిర్వీర్యం చేసి నష్టాలు వస్తున్నాయని చెప్పడం కార్మికులను మోసగించడం కాదా. ఎన్నో ఉద్యమాలు, బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు పరిరక్షణకు ఒక ఆంద్రుడిగా సోము ప్రయత్నించక పోవడం శోచనీయం. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రైవేటీకరణను ఆపలేని సోము.. జెన్కో కార్మికుల కోసం పోరాటం చేస్తానని ఆవేశపడడం విచిత్రంగా ఉంది.

రాష్ట్రానికి ఏమి చేశారు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి ఫలానా పనిచేశాను అని చెప్పుకోవడానికి సోముకు ఏమీలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి చట్టప్రకారం రావాల్సిన నిధులను రాబట్టడంలోకానీ, ప్రధాని మోడీ స్వయంగా హామీఇచ్చిన ప్రత్యేకహోదా సాధించడంలో కానీ సోము ఎందుకు ప్రయత్నం చేయడం లేదు. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నా రాష్ట్రానికి బీజేపీ మేలు చేయలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తామని చెబితే జనం నమ్ముతారా? ఓట్లు వేస్తారా? అని సోము వీర్రాజు ఆలోచించుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.

పంటలకి గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రైతు సమస్యలపై త్వరలో పాదయాత్ర చేస్తామని సోము వీర్రాజు చెబుతున్నారు. ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేసే కన్నా ఢిల్లీయాత్ర చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగే పనులు చేయాలని జనం కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి