iDreamPost

మరో దశకు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం

మరో దశకు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు నెల రోజులుగా సాగుతున్న కార్మికుల ఉద్యమం మరో మలుపు తిరిగింది. ఇన్ని రోజులుగా కార్మికులు ఉద్యమం చేస్తున్నా.. వారి ఆందోళనలను, ఉద్యోగ, ఉపాధి భద్రతను పరిగణలోకి తీసుకోని కేంద్రం.. పార్లమెంట్‌ వేదికగా స్టీల్‌ప్లాంట్‌ విక్రయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. దీంతో కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సంకల్పించారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్థయించారు. ఈ మేరకు స్టీల్‌ ప్లాంట్‌ యాజమన్యానికి సమ్మె నోటీసును ఇచ్చారు. 14 రోజుల వ్యవధి తర్వాత సమ్మె చేయడంపై కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. సమ్మెకు వెళ్లే ముందు ఈ నెల 17వ తేదీన కార్మిక సంఘాలు సంయుక్తంగా ధర్నా చేయాలని తలపెట్టాయి. ఈ నెల 20వ తేదీన కార్మికుల కుటుంభాలతో స్టీల్‌ ప్లాంట్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ సభ ద్వారా తమ ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కార్మికులు భావిస్తున్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పు లేకపోతే 25వ తేదీన సమ్మె చేయడంపై నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు యోచిస్తున్నాయి.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలతోపాటు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. నష్టాల పేరు చెప్పి ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నష్టాల నుంచి ప్లాంట్‌ను లాభాల్లోకి ఎలా తీసుకురావచ్చునో వివరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దీనికి కొనసాగింపుగా.. ఇటీవల మరో లేఖ రాశారు. అఖిలపక్షం నేతలతో కలసి వచ్చి స్టీల్‌ ప్లాంట్‌ ప్రాముఖ్యతను వివరిస్తానని, సమయం ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మరో లేఖ రాశారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. ఆ విషయం బహిరంగంగా చెప్పడం లేదు. విశాఖ శ్రీ శారదాపీఠం జయేంద్ర సరస్వతి కూడా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటన చేశారు.

ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల ఉద్యమానికి మద్ధతునిస్తున్నాయి. ఈ క్రమంలో కార్మికులు చేసే సమ్మె ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.

Also Read : విశాఖ ఉక్కు – రాజీనామా చేస్తే ఏమవుతుంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి